కాంగ్రెస్ తాజా ఫైటింగులు.. ముచ్చటగా 3 జిల్లాల్లో..
సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లిలో సర్పంచ్‌పై చెప్పుతో దాడి చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ నేత వైద్య శివప్రసాద్ నివాసంలో కార్యకర్తలు సమావేశం అయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు వేసవి ఎండలను మించి భగ్గుమంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ హస్తం నేతలు కుస్తీలకు దిగుతున్నారు. తాజాగా వరంగల్, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు పరస్పరం దాడి చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల వేళ పార్టీలో జరుగుతున్న ఫైటింగులు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.
పొంగులేటి సమక్షంలోనే..
ఖమ్మం జిల్లా దమ్మాయిగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. సభ ప్రారంభం కాగానే బీరోలు సొసైటీ ఛైర్మన్ రామసహాయం నరేశ్‌రెడ్డి, బీరోలు మాజీ ఉపసర్పంచ్ మిర్యాల విక్రమ్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. విక్రమ్‌రెడ్డిని వేదికపైకి పిలవాలని ఆయన వర్గీయులు నినాదాలు చేయడంతో మంత్రి పొంగులేటి వేదికపైకి ఆహ్వానించారు. దీంతో రామసహాయం నరేశ్‌రెడ్డి రెచ్చిపోయారు. "వాడు పైకి వస్తే నేను వెళ్లిపోతా.. వాడు ప్రసంగించడానికి వీల్లేదు.." అని తెగేసి చెప్పారు. బీఆర్‌ఎస్ మాజీఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి పంచన ఉన్న వాళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి నాయకులమంటున్నారు అని మండిపడ్డారు. ఇరువర్గాల మధ్య నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ముగ్గురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొండా సురేఖ ముందే..
వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూప్ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. వరంగల్ తూర్పు, వర్దన్నపేటలో పదవుల కోసం పాత కాంగ్రెస్ నేతలు ఫైటింగ్‌కు దిగారు. వరంగల్ తూర్పులో కడియం కావ్య కోసం మంత్రి కొండా సురేఖ ప్రచారం చేస్తుండగా ఆమె ముందే కాంగ్రెస్ లీడర్లు గొడవపడ్డారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని సీనియర్ నాయకులు ఘర్షణకు దిగారు. వర్దన్నపేటలోనూ సేమ్ సీన్ రిపీటైంది. కడియం శ్రీహరి, కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముందే పాత లీడర్లు, కొత్త లీడర్లుగా విడిపోయి కొట్టుకున్నారు.
సర్పంచ్‌పై చెప్పుతో దాడి..
సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లిలో సర్పంచ్‌పై చెప్పుతో దాడి చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ నేత వైద్య శివప్రసాద్ నివాసంలో కార్యకర్తలు సమావేశం అయ్యారు. రెండురోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరిన ఇందిరమ్మకాలనీ మాజీసర్పంచ్ బైరి రమేశ్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఆయన్ను చూసిన వెంటనే అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత మధుకర్ ఆగ్రహంతో ఊగిపోయి, చెప్పుతో దాడి చేశారు. ఇలా ఏ నియోజకవర్గం చూసినా పాత లీడర్లు వర్సెస్ కొత్త లీడర్లు అన్నట్లు పరిస్థితి ఉంది. ఎన్నికలవేళ వరుస ఫైటింగులతో కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది.