కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారా..?
సహజంగానే మీడియా సెన్సేషన్ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఇక రేవంత్ వర్గీయులు కోమటిరెడ్డి విషయంలో ఏ తప్పు చేస్తాడా..? అని కాచుకొని ఉంటారు.
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అందరూ కష్టపడ్డా కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 సీట్లు రావని ఆయన అన్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో సొంత పార్టీ నేతలు కూడా కోమటిరెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఓ వైపు హాత్ సే హాత్ జోడో యాత్ర అంటూ మేం ఊరూరా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం ఏమిటని వారు ఫైర్ అవుతున్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి కోమటిరెడ్డి ఏమన్నారంటే.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం రాదు.. హంగ్ వచ్చే చాన్స్ ఉంది.. ఏవైనా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు కాబట్టి.. ఈ రెండు పార్టీలు కలిసి అధికారం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో తాము ఎప్పటికీ కలిసి అధికారం పంచుకోలేము కాబట్టి.. బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తుందేమో అని ఆయన అభిప్రాయపడ్డారు.
సహజంగానే మీడియా సెన్సేషన్ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఇక రేవంత్ వర్గీయులు కోమటిరెడ్డి విషయంలో ఏ తప్పు చేస్తాడా..? అని కాచుకొని ఉంటారు. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగి కోమటిరెడ్డిపై ఇప్పటికైనా అధిష్టానం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం.
రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక .. కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పీసీసీ పదవిని ఆశించి.. రేసులో చివరిదాక నిలిచిన కోమటిరెడ్డి కూడా ఆ అసంతృప్తితోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటలను ఆయన మీడియా ముందు మాట్లాడటంతో రచ్చ రచ్చ అయ్యింది. బీఆర్ఎస్ ను ఓడించేందుకు మేమంతా కంకణం కట్టుకుంటే.. కోమటిరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని ఆయన శత్రువులకు కూడా అవకాశం దొరికింది. మరి కోమటిరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకుంటుందా..? లేక చర్యలు తీసుకుంటుందా..? అన్నది వేచి చూడాలి.