అటకెక్కిన మరో హామీ.. పంట బోనస్‌పై రేవంత్ యూటర్న్
సన్న రకాలకు పీడ, చీడల బాధ ఎక్కువగా ఉండడంతో వాటిని పండించేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపరు. ఇక రేవంత్ తాజా ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీపై మాట మార్చింది. గతంలో నిరుద్యోగ భృతిని అటకెక్కించిన రేవంత్ ప్రభుత్వం.. తాజాగా పంట బోనస్ విషయంలోనూ మెలికపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు గ్యారెంటీలు ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో రైతు భరోసా పేరుతో ఓ గ్యారెంటీ ప్రకటించింది. ఇందులో భాగంగా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయంతో పాటు వరి పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ప్రకటించింది. క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌గా ఇస్తామని హామీ ఇచ్చింది. ఐతే తాజాగా మీడియాతో చిట్‌చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం సన్న రకం వడ్లు పండించిన రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటన చేశారు.
సాధారణంగా రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లే పండిస్తారు. సన్న రకాలకు పీడ, చీడల బాధ ఎక్కువగా ఉండడంతో వాటిని పండించేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపరు. ఇక రేవంత్ తాజా ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. హామీలు అమలు చేయలేక ప్రభుత్వం రోజుకో మెలిక పెడుతుందంటూ ఫైర్ అవుతున్నారు. ఏ పంట వేసినా బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తామనడం సరికాదంటున్నారు.
ఇక రేవంత్ ప్రకటనపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. రేవంత్ ప్రకటన రైతాంగాన్ని వంచించడమేనన్నారు కేసీఆర్. ఓట్లు డబ్బాలో పడగానే రైతులతో కాంగ్రెస్ అవసరం తీరిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపైనా కేసీఆర్ మండిపడ్డారు.