సినిమా ఫ్లాప్.. అందుకే పబ్లిసిటీ పీక్స్
మేళతాళాలు, డప్పు వాయిద్యాలపై బీఆర్ఎస్ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఫ్లాప్ షో గా మిగిలిందని ఎద్దేవా చేస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చారు. ఆయన ఎంట్రీని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. విమానాశ్రయం వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు. బొకేలు, శాలువాలతో కార్యకర్తలు సందడి చేశారు. మేళతాళాలు, డీజే సౌండ్ లతో హోరెత్తించారు. కారులో నిలబడి ర్యాలీగా విమానాశ్రయం నుంచి ముందుకు కదిలారు రేవంత్ రెడ్డి.
విదేశీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ వేశారు. మన బిడ్డల కొలువుల కోసం, మన రాష్ట్రానికి పరిశ్రమల కోసం, ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ బ్రాండింగ్ కోసం తాను అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి వచ్చానన్నారు. తన పర్యటన విజయవంతమైందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా వెల్లువలా తరలివచ్చి తనకు స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలంటూ రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ మేళతాళాలు, డప్పు వాయిద్యాలపై బీఆర్ఎస్ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఫ్లాప్ షో గా మిగిలిందని ఎద్దేవా చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్యటన విషయంలో అది మరోసారి రుజువైందంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ట్వీట్ వేశారు.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. స్వచ్ఛ బయో వంటి కంపెనీలతో క్విడ్ ప్రోకో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపిస్తోంది. రేవంత్ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడనిదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.