వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ వీడియో.. ఎందుకంటే..?

అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేసీఆర్ కి అనుమతి ఇవ్వని అధికారులు, HCU విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడటానికి రేవంత్ రెడ్డికి ఎలా అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

Advertisement
Update:2024-05-12 10:48 IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. సీఎం స్థాయి వ్యక్తి అయినా ఆటవిడుపుగా గ్రౌండ్ లోకి దిగడం, విద్యార్థులను ఉత్సాహ పరచడానికి వారితో కలసి ఆటలు ఆడటాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ ఇప్పుడున్నది సైలెంట్ పీరియడ్. నిన్న సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ఆగిపోయింది. నాయకులు ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారు. ప్రచారానికి అవకాశం ఉన్న ఏ కార్యక్రమాలలోనూ వారు పాల్గొనడంలేదు. అయితే రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడటం, యువతతో మాట కలపడం ఇక్కడ సంచలనంగా మారింది.

ఎందుకీ వివక్ష..?

ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ప్రచారంపై ఆంక్షలు ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి వెళ్లడానికి అనుమతివ్వడం కరెక్టేనా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ దేవరకొండ పర్యటనకు నల్గొండ జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వకపోవడం మరింత సంచలనంగా మారింది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్ తండ్రి కనీలాల్ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేసీఆర్ దేవరకొండకు వెళ్లాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ ఉందని, కేసీఆర్ అక్కడికి రావడం కుదరదని కలెక్టర్ ఆక్షేపించారు, అనుమతి నిరాకరించారు. దీంతో కేసీఆర్ పర్యటన రద్దయింది.


అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేసీఆర్ కి అనుమతి ఇవ్వని అధికారులు, HCU విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడటానికి రేవంత్ రెడ్డికి ఎలా అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు వినపడుతున్నాయి. కేసీఆర్ దేవరకొండకు వెళ్తే ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకుంటే, ఎన్నికలకు ముందు రోజు సీఎం రేవంత్ రెడ్డి, యూనివర్శిటీ విద్యార్థులను కలవడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. దీనిపై ఈసీ స్పందించాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News