2004లోనే కాంగ్రెస్ ధోకా.. మళ్లీ ఇవ్వొచ్చా ఔర్ ఏక్ మోకా..?
కాంగ్రెస్ దగా చేయబట్టే తెలంగాణ సాకారం ఆలస్యమైందన్నారు. కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా అనే ప్రకటనతో తాను ఆమరణ దీక్ష చేపడితే దిగివచ్చి తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారని గుర్తు చేశారు.
జుక్కల్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటుని ఆలస్యం చేసిన కాంగ్రెస్ ఈ ప్రాంతానికి ప్రథమ శత్రువని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ కి మరోసారి అవకాశం ఇవ్వకూడదన్నారు. సమైక్య పాలనలో ఎన్నో బాధలు పడిన తర్వాత 2000 సంవత్సరంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు కేసీఆర్. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తు కలిసిందని, అప్పుడే తెలంగాణ ఇస్తే బాగా బాగుపడేవాళ్లమని, కానీ 14 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ దగా చేయబట్టే తెలంగాణ సాకారం ఆలస్యమైందన్నారు. కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా అనే ప్రకటనతో తాను ఆమరణ దీక్ష చేపడితే దిగివచ్చి తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారని గుర్తు చేశారు.
పదేళ్ల క్రితం మన పరిస్థితి ఎలా ఉందో, ఈ రోజు ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలన్నారు సీఎం కేసీఆర్. జుక్కల్ నియోజకవర్గం వెనకబడ్డ ప్రాంతం అని.. కారు చీకటి తప్ప మంచినీళ్లు, సాగునీళ్లు లేవని.. దూర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు ఉండేవన్నారు. రైతులు అప్పులు కట్టలేక, బోర్లు వేయలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కోకొల్లలు అన్నారు. ఆ రోజులు మరచిపోయి ఇప్పుడు స్వయం పాలనలో ఇబ్బందులు తొలగించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ కి అధికారమిస్తే మళ్లీ పాత రోజులే వస్తాయన్నారు కేసీఆర్.
ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడాలని, అప్పుడే మన తలరాత మారుతుందని ప్రజలకు సూచించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని.. ఎన్నికలొస్తే అనేక పార్టీలు వస్తాయి, అనేక మంది నాయకులు అనేక మాటలు చెప్తారు.. కానీ ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పారు కేసీఆర్. ఎవరో చెప్పారని ఓటు వేస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతుందన్నారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంచి మనిషి, ప్రేమగా ఉండే మనిషి అని, తన వద్దకు ఎప్పుడొచ్చినా.. వ్యక్తిగతమైన పని అడగడు కానీ.. ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు, నీళ్లు కావాలని అడుగుతారని చెప్పారు. మరో గొప్ప వ్యక్తి బీబీ పాటిల్ ఎంపీగా ఉండటం వల్లే ఈ ప్రాంతానికి హైవే రోడ్లు వచ్చాయని అన్నారు కేసీఆర్. ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో జుక్కల్ లో మంచి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు.