ప్రగతి గణనీయం, కానీ లక్ష్యాలకు భారత్ ఇంకా దూరం

Advertisement
Update:2023-08-15 13:06 IST

76 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరాల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి అని అన్నారు సీఎం కేసీఆర్. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నా కూడా పాలకుల అసమర్థత కారణంగా వనరుల సద్వినియోగం జరగలేదన్నారు. అన్నీఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారని చెప్పారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బలహీనవర్గాల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదన్నారు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్రానికి సార్థకత అని చెప్పారు కేసీఆర్. గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు.


తెలంగాణ విషయానికొస్తే..

దేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. పదేళ్ల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవన చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లవుతుందని, దు:ఖం తన్నుకొస్తుందని అన్నారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధికి తెలంగాణ సాక్షిగా నిలిచిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఏకకాలంలో మౌలిక వసతులు కల్పిస్తూ, ,సమగ్ర దృక్పథాన్ని అవలంబిస్తోందని చెప్పారు. దళిత బడుగు, బలహీన వర్గాలు, రైతాంగం మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకూ అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తోందన్నారు కేసీఆర్. నేడు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారని చెప్పారు. అతి పిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఇప్పుడు దేశమంతా విస్తృతంగా చర్చ జరగడం.. మనందరికీ గర్వకారణం అన్నారు కేసీఆర్.

సంపద పెంచు.. ప్రజలకు పంచు

సంపద పెంచు-ప్రజలకు పంచు అనే ఆశయంతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరుగుతోందని.. ఇది మనం చెప్పే మాట కాదని, నీతి ఆయోగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు సీఎం కేసీఆర్. జాతీయ స్థాయిలో నమోదైన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైందన్నారు. పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, పరిశ్రమలకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు. 2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయని వివరించారు. 2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా, 2014 నుంచి 2023 నాటికి 2.41 లక్షల కోట్ల రూపాయలకు ఐటీ ఎగుమతులు పెరిగాయని చెప్పారు కేసీఆర్. తలసరి ఆదాయంలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ తెలంగాణ నెంబర్-1 అని అన్నారు. 

Advertisement

Similar News