ఐరన్‌ లెగ్‌ రేవంత్‌ ఢిల్లీకి పోయి కాంగ్రెస్‌కు గుండు సున్న తెచ్చిండు

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పతనాన్ని ఆరంభించి ఢిల్లీలో ముగించాడు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2025-02-08 15:34 IST

ఐరన్‌ లెగ్‌ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి పోయి కాంగ్రెస్‌కు గుండు సున్న తీసుకొచ్చిండని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వికారాబాద్‌ బీఆర్‌ఎస్‌ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్‌ పతనాన్ని ప్రారంభించిన రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో ముగించాడని.. రాబోయే రోజుల్లో దాన్ని కొనసాగిస్తాడని అన్నారు. ఈ దేశంలో నరేంద్రమోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్‌ గాంధీనేనని.. దేశంలో బీజేపీని గెలిపించేదే రాహుల్‌ నాయకత్వమని సెటైర్లు విసిరారు. కేసీఆర్‌ హెచ్చరించినట్టుగానే కాంగ్రెస్‌కు ఓటేసినందుకు రైతుబంధు రాం రాం అయ్యిందని గుర్తు చేశారు. ఏడాదిలోపే కాంగ్రెస్‌ పార్టీ దగాకోరు తనాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని, ప్రజలు తిడుతున్న తిట్లు వింటే రేవంత్‌ రెడ్డి తట్టుకోలేడని అన్నారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్తే ముఖ్యమంత్రిని రైతులు దంచి కొట్టేలా ఉన్నారని అన్నారు.




 

పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటుతోనే వికారాబాద్‌లో మెతుకు ఆనంద్ ఓడిపోయాడన్నారు. మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారని ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారని అన్నారు. అసెంబ్లీని స్పీకర్‌ సీఎం సూచన మేరకే నడిపిస్తున్నారని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మైక్‌ ఇవ్వడానికి వణికిపోతున్నాడని అన్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్‌ ఆడుతున్నారని అన్నారు. ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలోనే సవాల్‌ చేశానని.. ఇప్పుడు అదే సవాల్‌ కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో 25 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదన్నారు. రూ.49,500 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా రూ.18 వేల కోట్లు మాత్రమే చేశామని ప్రభుత్వం చెప్తోందని.. అందులోనూ రైతులకు అందింది రూ.11 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. ఈ విషయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే చెప్పారని అన్నారు.

ఎన్నికలకు ముందు కేసీఆర్‌ రైతుబంధు కోసం సమకూర్చిన డబ్బునే రేవంత్‌ రెడ్డి రైతుల ఖాతాల్లో వేసిండని.. ఆ తర్వాత నయా పైసా ఇవ్వలేదన్నారు. రైతుభరోసా పైసలు టకీ టకీ వేస్తామని చెప్పిండని.. కానీ ఒక్క రూపాయి కూడా పడలేదన్నారు. తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పింఛన్లు పెంపు కూడా టకీ టకీ మని పడలేదన్నారు. అవినీతి మరకలేని మెతుకు ఆనంద్‌ కొంత లౌక్యం నేర్చుకోవాలని సూచించారు. వికారాబాద్‌ అభివృద్ధికి కేసీఆర్‌ ఎంతో కృషి చేశారన్నారు. రేవంత్‌ రెడ్డి, ఆయన మంత్రులు అందినకాడికి దోచుకుంటున్నారని, రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని నాశనం చేశారన్నారు. రేవంత్‌ రెడ్డి పుణ్యమా అని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంకో 15 ఏళ్ల వరకు ఓట్లు అడిగే పరిస్థితిలో లేదన్నారు. పది, పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందని, పార్టీ అభ్యర్థులను గెలిపించి వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ పై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. పార్టీలో అసంతృప్తులను ఆనంద్‌ దగ్గరకు తీసుకోవాలని, అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.

Tags:    
Advertisement

Similar News