పసలేని కాంగ్రెస్.. బిసబిస మాటలు
జిల్లాలో మంత్రులుగా పనిచేసినవారెప్పుడూ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో కొట్లాడి నల్లగొండ జిల్లాకు నీళ్లు తేలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉందని వివరించారు సీఎం కేసీఆర్. పసలేని కాంగ్రెస్ నాయకుల బిసబిస మాటలతో పనులు కావని, మరోసారి బీఆర్ఎస్ కే ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఊడగొట్టింది ఎవరు..? తెలంగాణలో ప్రాజెక్టులను కట్టకుండా ఆపింది ఎవరు..? ఇంత జరుగుతున్నా మారు మాట్లాడకుండా నోరు మూసుకుని పడి ఉన్న దద్దమ్మలు ఎవరు..? ఏ పార్టీ వాళ్లు..? అంటూ కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఇదంతా ఓ చరిత్ర అని అన్నారు. 2001లో నేను గులాబీ జెండా ఎగరేసి ఈ అన్యాయాలపై నిలదీసే వరకు వాటి గురించి అడిగిన మొగోడే లేడన్నారు. ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసినవారెప్పుడూ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో కొట్లాడి నల్లగొండ జిల్లాకు నీళ్లు తేలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉందని వివరించారు సీఎం కేసీఆర్. పసలేని కాంగ్రెస్ నాయకుల బిసబిస మాటలతో పనులు కావని, మరోసారి బీఆర్ఎస్ కే ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ఓటు వేసేటప్పుడు ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయాలన్నారు సీఎం కేసీఆర్. ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతుందో, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే బాగా పని చేస్తాడో.. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఒకప్పుడు కోదాడలో పంట పొలాలకు నీళ్ల కోసం ప్రతిసారీ ధర్నాలు చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. 2003లో పంట పొలాలకు నీళ్లు ఆపేస్తే.. తనకు కొంతమంది వచ్చి చెప్పుకున్నారని.. జనంతో కలసి తాను నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తే అప్పుడు నీళ్లిచ్చారని చెప్పారు కేసీఆర్. సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పాలకులు తెలంగాణలో సాగుబడిని పట్టించుకోకుండా ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోయారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకుని పడిఉన్నరని, దద్దమ్మల్లా మారు మాట్లాడలేదని మండిపడ్డారు కేసీఆర్.
మోసం, దగా..
గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఎలా మోసం చేసిందో వివరించారు సీఎం కేసీఆర్. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును 20 కిలోమీటర్ల దిగువన కట్టడంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తున్నామని అన్నారు. మరోసారి అలాంటి నాయకుల చేతిలో పాలన పెట్టి తప్పు చేయొద్దని ప్రజలకు సూచించారు సీఎం కేసీఆర్.