కేటీఆర్‌ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నరు
పోలీసులు చెప్తేనే 12న జరగాల్సిన రైతు దీక్షను వాయిదా వేశం : జగదీశ్ రెడ్డి
కేటీఆర్ ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు చెప్తేనే ఈనెల 12న నల్గొండలో తలపెట్టిన రైతు దీక్షను వాయిదా వేశామని.. వాళ్ల సూచనతోనే 21న దీక్ష చేయడానికి సిద్ధపడినా పర్మిషన్ రిజెక్ట్ చేశారని తెలిపారు. పోలీసులకు ఎక్కడి నుంచి ఒత్తిడి వస్తే అనుమతి ఇవ్వలేదో అందరికీ తెలుసన్నారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు సూచన ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. పోలీసులు, సెక్యూరిటీ లేకుండా నల్గొండ జిల్లాలో అడుగు భయటపెట్టలేని కోమటిరెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎప్పుడు దొరుకుతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతులు పండించిన పంట పూర్తిగా కొనేవరకు తాము కల్లాల్లోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీ మిల్లర్లతో కుమ్మక్కయి వాళ్ల ఆరుగాలం కష్టాన్ని దళారుల చేతుల్లో పెట్టారని తెలిపారు.
కేటీఆర్ నల్గొండకు వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకు లాగు తడుస్తుందని ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వల్లనే పోలీసులు రైతుదీక్షకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేపడుతాయని తెలిపారు. సీఎం, మంత్రులు హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్ ఎదుట, రాజ్ భవన్ ఎదుట ధర్నాలు చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగలేదా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై తనతో చర్చకు వచ్చే దమ్ము కోమటిరెడ్డికి ఉందా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పాపాలతోనే నల్గొండలో ఫ్లోరైడ్ మహమ్మారి పుట్టిందన్నారు. తాను జిల్లాలో చేసిన అభివృద్ధిని చూడటానికే కోమటిరెడ్డికి జీవితకాలం సరిపోదన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టును ఆపేస్తానని చెప్పిన కోమటిరెడ్డి సిగ్గులేకుండా ప్రారంభోత్సవానికి వెళ్లారని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడూ స్పృహలో ఉండి మాట్లాడటం లేదన్నారు. ఇంతకాలం సరైన పోటీ లేకుండనే కోమటిరెడ్డి నల్గొండలో గెలుస్తూ వస్తున్నారని.. భూపాల్‌రెడ్డి దెబ్బకు ఓటమి తప్పలేదన్నారు. కోమటిరెడ్డి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆయన ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.