ముగిసిన సీఎల్పీ సమావేశం.. ఏకవాక్య తీర్మానం

ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాజ్‌ భవన్‌ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి కావాల్సిన సామాగ్రిని కూడా తరలిస్తున్నారు.

Advertisement
Update:2023-12-04 13:15 IST

కాంగ్రెస్ లేజిస్లేచర్ పార్టీ సమావేశం హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో ముగిసింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 64మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం ఎంపికపై పరిశీలకులు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఏకవాక్య తీర్మానాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ప్రవేశ పెట్టగా.. తుమ్మల నాగేశ్వర రావు బలపరిచారు.


సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ లో చాలామంది ఆశపడుతున్నా.. ఆ బాధ్యత అధిష్టానంపై పెడుతూ ఏకవాక్య తీర్మానం చేసి సరిపెట్టారు. బంతి అధిష్టానం కోర్టులో ఉండటంతో.. ముగ్గురు నేతలు బలంగా లాబీయింగ్ చేస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి. నేతల సంగతి పక్కనపెడితే.. కార్యకర్తలంతా రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ని గెలుపు తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి మాత్రమే ఆ పదవికి అర్హులని అంటున్నారు.

సాయంత్రం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం..

ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాజ్‌ భవన్‌ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి కావాల్సిన సామాగ్రిని కూడా తరలిస్తున్నారు. రాజ్‌ భవన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సాధారణ పరిపాలన విభాగం ఏర్పాట్లు చేస్తోంది. మరికాసేపట్లో సీఈవో వికాస్‌ రాజ్‌ రాజ్‌భవన్‌ కు వెళ్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ ను గవర్నర్‌ కు అందజేస్తారు. ఆ జాబితా అధికారికంగా అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తారు. 


Tags:    
Advertisement

Similar News