సిట్టింగ్ ఎంపీకే చేవెళ్ల సీటు.. కేటీఆర్ ముందస్తు వ్యూహం

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా.. ఓటింగ్ శాతంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య తేడా స్వల్పంగానే ఉంది. ఈ స్వల్ప తేడాను కవర్ చేసుకుంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశముంది.

Advertisement
Update:2023-12-25 16:12 IST

లోక్ సభ ఎన్నికలకోసం ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని మరోసారి బరిలో దింపేందుకు నిర్ణయించారు. సమీక్ష అనంతరం రంజిత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ తమకు దిశా నిర్దేశం చేశారని, తనను చేవెళ్ల ఎంపీగా మరోసారి పోటీ చేయాలని ఆదేశించారని చెప్పారు రంజిత్ రెడ్డి.

చేవెళ్ల లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల నాలుగు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మూడుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మొత్తంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ కే అత్యథిక ఓట్లు వచ్చాయి. మెజార్టీలన్నీ కలుపుకొంటే.. లక్షా 9వేల పైచిలుకు ఓట్లు బీఆర్ఎస్ కి అదనంగా లభించాయి. అంటే చేవెళ్ల లోక్ సభ కచ్చితంగా బీఆర్ఎస్ కే దక్కే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకంటే మరిన్ని ఎక్కువ ఓట్లు ఈసారి బీఆర్ఎస్ కి పోల్ అవుతాయని అన్నారు ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి.

ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి..

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా.. ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగానే ఉంది. ఈ స్వల్ప తేడాను కవర్ చేసుకుంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశముంది. అదే వ్యూహంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. ముందస్తుగా నియోజకవర్గాల వారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సీట్లు ఖరారు చేస్తూ, వారిని రంగంలోకి దిగాలని ఆదేశాలిస్తున్నారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. కేటీఆర్ వ్యూహాలతో లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు కనపడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News