తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం
రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్నివర్గాలను మోసం చేసిందన్న జేపీ నడ్డా
తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమౌతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యాలపై సరూర్ నగరలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. 13 రాష్ట్రాల్లో బీజేపీ, 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి పాలిస్తున్నదని, జమ్మూకశ్మీర్‌లో అత్యధిక సీట్లతో విపక్షంలో ఉన్నామని చెప్పారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ గెలుస్తున్నదని, తెలంగాణలోనూ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నదని మండిపడ్డారు. మహారాష్ట్రలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడిందని ఎద్దేవా చేశారు. బీజేపీతో నేరుగా తలపడ్డ ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలవలేదన్నారు. రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్నివర్గాలను మోసం చేసిందన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని ఇవ్వలేదు. రూ. 15 వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేసింది. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని మాట తప్పింది. ప్రతి మహిళలకు రూ. 2,500 ఇస్తామని మాట తప్పింది. షాదీముబారక్ ద్వారా రూ. లక్ష నగదు, తులం బంగారం ఇస్తామని మోసం చేసిందని ధ్వజమెత్తారు.