తెలంగాణకు రావల్సిన రూ. 30 వేల కోట్లను కేంద్రం ఆపేసింది : మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో రైతు సర్కారు ఉన్నదని, ఇక్కడ అమలవుతున్న పథకాలను జీర్ణించుకోలేకనే కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకుంటోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావల్సిన రూ. 30 వేల కోట్లను నిలిపివేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని సీఎం కేసీఆర్ చెప్పారని, అందుకే బావుల దగ్గర మీటర్లు పెట్టట్లేదని మంత్రి వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుండటంతో వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. తెలంగాణలో రైతు సర్కారు ఉన్నదని, ఇక్కడ అమలవుతున్న పథకాలను జీర్ణించుకోలేకనే కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తగిన భరోసా ఇస్తోందని, సరైన సమయంలో చేయూత అందించడంతో అన్నదాతలు అద్భుతాలు సృష్టిస్తున్నారని మంత్రి చెప్పారు. గురువారం మెదక్ జడ్పీ సర్వసభ్య సమావేశానికి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు.
రైతులు భూమికి బరువయ్యేంత పంటలు పడిస్తున్నారని, దేశంలో ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకున్నా.. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా వంటి ఏ పథకాన్ని ఆపలేదని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, కోల్ ఇండియా వంటి సంస్థలను అమ్మడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తోందని మంత్రి దుయ్యబట్టారు. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటుపరం చేస్తే అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ పోల్స్ పెట్టుకోలేమని.. మరోవైపు కరెంటు బిల్లులు భారీగా పెరిగిపోతాయని, ముక్కు పిండి వాటిని వసూలు చేస్తారని మంత్రి చెప్పారు. మెదక్‌కు రైల్వేలైన్ తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఇప్పటికే దానికి అయ్యే ఖర్చులో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాబోయే 10 ఏళ్ల వరకు రైలు నడపడం వల్ల నష్టం వస్తే దాన్ని మేమే భరిస్తామని కేంద్రానికి రాతపూర్వకంగా చెప్పినట్లు మంత్రి వివరించారు.
దసరాలోగా 1000 మంది రెగ్యులర్ డాక్టర్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమిస్తామని మంత్రి చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే భయపడిన వాళ్లే.. ఇప్పుడు దర్జాగా వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 80 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం వైద్య, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీహెచ్‌సీలలో మూడు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు.ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మృతి చెందిన ఘటనకు బాధ్యులైన వారిపై 3 రోజుల్లో చర్య తీసుకుంటామని చెప్పారు.