కేటీఆర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే!
కేటీఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్‌మీడియా విభాగం మేడిగడ్డను సందర్శించారని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు వలీ షేక్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా మేడిగడ్డ బ్యారేజ్‌పై డ్రోన్ ఎగరేశారంటూ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ వలీ షేక్ ఫిర్యాదు చేశారు. దీంతో భారత న్యాయ సంహిత- BNS 223 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
కేటీఆర్‌తో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, బాల్క సుమన్‌లపైనా కేసు నమోదైంది. గత నెల 26వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్‌మీడియా విభాగం మేడిగడ్డను సందర్శించారని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు వలీ షేక్. పర్యటన సందర్భంగా డ్రోన్ విజువల్స్ తీశారని, ఇలాంటి చర్యలతో తెలంగాణకు అతిముఖ్యమైన మేడిగడ్డ ప్రాజెక్టుకు ముప్పు ఉందన్నారు. అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గత నెలలో కేటీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. ఎగువన గోదావరికి వరద లేనప్పటికీ.. ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో మేడిగడ్డ దగ్గర దాదాపు 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని, ఆ నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.