అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. - సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ బహిరంగ లేఖ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను నిలిపివేసిందని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Update: 2024-06-25 02:54 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లేక నేతన్నలు ఉసురు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా.. అంటూ ఆ లేఖలో కేటీఆర్‌ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 10 మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, గతంలో నేతన్నలకు అందిన ప్రతి పథకాన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను నిలిపివేసిందని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్నీ వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని ఆయన కోరారు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కేటీఆర్‌ ఈ సందర్భంగా తన లేఖలో ప్రస్తావించారు.

Tags:    
Advertisement

Similar News