ఖైరతాబాద్ ఉపఎన్నిక ఖాయం.. దానంను వదిలేది లేదు - కేటీఆర్
అధికారం కోసం ఆశపడి.. తనను గెలిపించిన ప్రజలకు దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచారన్నారు కేటీఆర్. ఖైరతాబాద్ ప్రజలు దానంకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సికింద్రాబాద్ పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవాళ్లే నిజమైన నాయకులని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్నారు. దానం నాగేందర్‌ది అలాంటి నిర్ణయమేనన్నారు కేటీఆర్.
అధికారం కోసం ఆశపడి.. తనను గెలిపించిన ప్రజలకు దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచారన్నారు కేటీఆర్. ఖైరతాబాద్ ప్రజలు దానంకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రెండు పడవల మీద నడవడం మంచిది కాదన్నారు. దానంపై ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు కేటీఆర్. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానంను ప్రకటించిన నాడే అనర్హత వేటు వేసి ఉండాల్సిందన్నారు.
రాజకీయ ఒత్తిళ్లకు లోనై దానంపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామన్నారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేవరకు వదిలే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. మూడు, నాలుగు నెలల్లో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రాబోతుందన్నారు. అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ద్రోహం చేసిన దానం నాగేందర్‌కు బుద్ధి చెప్పాల్సిందేనన్నారు.