యువత, విద్యార్థులపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్ట్రాటజీ

విద్యార్థులు, యువత, తొలి సారి ఓటు హక్కు పొందిన వారిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.

Advertisement
Update:2023-04-22 15:22 IST

తెలంగాణలో మూడో సారి విజయం సాధించి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. 2001లో పార్టీని స్థాపించిన తర్వాత ఎన్నో గెలుపోటములు చూసిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం సాధించన తర్వాత రెండు సార్లు ఘనవిజయం సాధించారు. మూడో సారి కూడా తెలంగాణ ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గతంలో ఏనాడూ చూడని అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఇవి తప్పకుండా బీఆర్ఎస్ విజయానికి దోహదపడతాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

డిసెంబర్‌తో అసెంబ్లీ గడువు ముగియనున్నది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎలక్షన్‌కు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. ఈ సారి ఎన్నికల్లో యువత, విద్యార్థుల ఓట్లు కీలకం అయ్యే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అంచనాకు వచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థులు, యువత, తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ మీటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో యువత, విద్యార్థులకు సంబంధించి పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలను నాయకులకు వివరించనున్నారు.

బీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గాలు, డివిజన్లు, మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ కార్యకర్తలను ఎన్నికల కోసం సమాయాత్తం చేసేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడుతున్నాయి. మే నెల నుంచి పార్టీలకు అతీతంగా యువత, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక యువత, విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను 27న నాయకులకు వెల్లడించనున్నట్లు సమాచారం.

కొత్త విద్యా సంవత్సరం జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్నది. అంతకు ముందే అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ సమ్మేళనాల కోసం ప్రత్యేకంగా కమిటీలు కూడా వేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఓటర్లలో 40 ఏళ్లకు పైబడిన వారి మద్దతు ఎక్కువగా బీఆర్ఎస్‌కు ఉన్నది. వీరితో పోల్చుకుంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న యువత మద్దతు కాస్త తక్కువగా ఉన్నట్లు సర్వేల్లో తేలింది. ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వారు ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగ యువతే. ఆత్మీయ సమ్మేళనాల ద్వారా విద్యార్థులు, యువత కోసం బీఆర్ఎస్ పార్టీ గత 9 ఏళ్లలో ఏం చేసిందో వివరించనున్నారు.

గతంలో ఎవరూ చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మరో వైపు ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, హెల్త్ సెక్టార్స్‌లో అనేక పెట్టుబడులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రంగాల్లో వచ్చాయి. దీని వల్ల 16 లక్షల మంది యువతకు నేరుగా ఉద్యోగాలు లభించాయి. మరో 16 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ డేటాను యువతకు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వివరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా.. ప్రైవేటు రంగంలో బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఉద్యోగ అవకాశాలను వివరించనున్నారు.

కేవలం హైదరాబాద్‌కే ఐటీ రంగాన్ని పరిమితం చేయకుండా జిల్లాల్లో కూడా ఐటీ టవర్స్ నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ నిరంతర కృషి ఫలితంగా ఇప్పుడు టైర్-2 సిటీస్‌లో కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే. మరో వైపు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం దూసుకొని పోతోంది. ఇప్పటికే ప్రతీ లక్ష మందికి అత్యధిక మెడికల్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ విషయాలన్నీ విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వివరించనున్నారు. యువత, విద్యార్థులు కనుక బీఆర్ఎస్‌కు మద్దతు పలికితే పార్టీ మూడో సారి అధికారంలోకి రావడం సులభమే అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News