కవితకు దక్కని ఊరట.. సీబీఐ కస్టడీకి అనుమతి
రౌస్ ఎవెన్యూ కోర్టులో 11 పేజీలతో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. కవితపై కీలక ఆరోపణలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత కీలక సూత్రాధారి అని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ 15 వరకు కవితను సీబీఐ కస్టడీకి అప్పగించింది కోర్టు. సీబీఐ ఐదు రోజుల కస్టడీకి కోరగా.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.
రౌస్ ఎవెన్యూ కోర్టులో 11 పేజీలతో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. కవితపై కీలక ఆరోపణలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత కీలక సూత్రాధారి అని పేర్కొంది. అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161, 164 ప్రకారం కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ స్పష్టం చేసింది. కవిత ఇప్పటివరకూ దర్యాప్తునకు సహకరించలేదని తెలిపింది సీబీఐ. డబ్బుల కోసం కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించారని తన పిటిషన్‌లో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల ముడుపులు చెల్లించారని పిటిషన్‌లో ఆరోపించింది.
ఈనెల 6న కోర్టు అనుమతితో తిహార్ జైలులో కవితను ప్రశ్నించిన సీబీఐ అధికారులు గురువారం ఆమెను అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16న విచారణ జరగనుంది. ఇప్పుడు కవిత జైలు నుంచి బయటకు రావాలంటే ఈడీ కేసుతో పాటు సీబీఐ కేసులోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.