ఇవాళ కాంగ్రెస్‌లోకి అరికెపూడి.. నెక్ట్స్ ఎవరంటే?
ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ ఇటీవల చంద్రబాబును కలవడం, తర్వాత పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 30కి పడిపోయింది.
ఇవాళ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో క్రమంగా ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తన వైపు లాక్కుంటోంది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరతారని తెలుస్తోంది. ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ ఇటీవల చంద్రబాబును కలవడం, తర్వాత పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు మంత్రి శ్రీధర్ బాబుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. శ్రీధర్‌బాబుతో సమావేశమైన వారిలో ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు. వీరందరూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని శ్రీధర్ బాబును కోరగా.. తమ పార్టీలోకి రావాలంటూ మంత్రి శ్రీధర్ బాబు బహిరంగంగానే ఆహ్వానించారు. ఈ ఆరుగురిలో అరికెపూడి గాంధీ ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మిగతా ఐదుగురితో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
బడ్జెట్ సమావేశాల్లోపు వీలైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పాలనే యోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్తున్న విషయం తెలిసిందే. ఫిరాయింపులను బహిరంగంగానే సమర్థించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు . అభివృద్ధి కోసమే తమ పార్టీలో చేరుతున్నారంటూ, తాము ఎవరిని పార్టీలోకి రావాలని కోరట్లేదని చెప్తున్నారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది.