సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల : మంత్రి హరీశ్ రావు

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషపడే శుభవార్త త్వరలోనే వింటారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరిన్ని మంచి పథకాలు రాబోతున్నాయని హరీశ్ రావు చెప్పారు.

Advertisement
Update:2023-09-27 18:02 IST

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కేంద్రంలోని బీజేపీ కాపీ కొడుతోంది. తమ ప్రభుత్వం ఉచితంగానే రూ.1 లక్ష బీసీలకు ఇస్తుంటే.. కేంద్రం మాత్రం అప్పుగా ఇస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ పథకాలను ప్రధాని మోడీ కాపీ కొడుతున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మనోహరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషపడే శుభవార్త త్వరలోనే వింటారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరిన్ని మంచి పథకాలు రాబోతున్నాయని హరీశ్ రావు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కానీ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదని అంటున్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కేసీఆర్‌ను ప్రతిపక్షాలు కావాలనే విమర్శిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.

మన పాలనను తిట్టే ప్రతిపక్షాలు కావాలా? సంక్షేమ రూపంలో కిట్లు ఇస్తున్న కేసీఆర్ కావాలా అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చెప్పాలని.. తద్వారా ప్రతిపక్షాల అబద్దాలను తిప్పి కొట్టాలని అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధి.. ఇప్పుడు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో నిత్యం కరెంటు కోతలే.. కానీ ఇప్పుడు నిమిషం కూడా కరెంటు పోవడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలకు వారంటీ, గ్యారెంటీ సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు.

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ నేతలు ఎలాంటి అబద్దాలైనా మాట్లాడతారు.. కర్ణాటకలో చేయలేని కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం మాయమాటలు చెబుతున్నదని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల బోగస్ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని మంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ అబద్దాలకు మధ్య పోటీ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒక కర్ఫ్యూ వస్తుందని అన్నారు. ఆ పార్టీది తన్నుల సంస్కృతి.. మాది టన్నుల సంస్కృతని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.


Tags:    
Advertisement

Similar News