బీఆర్‌ఎస్ నేతల గృహ నిర్బంధం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను, నాయకులను హైదరాబాద్‌లో గృహ నిర్బంధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తామని ప్రకటించింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమ నిరసన తెలుపుతామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఉదయం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. బీఆర్‌ఎస్ నేతల నిరసన పిలుపు నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్ గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు సహా నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.