షాద్ నగర్ ఘోరంపై బీఆర్ఎస్ సూటి ప్రశ్నలు..
పోలీసుల అత్యుత్సాహం వల్ల దళిత మహిళ తీవ్ర గాయాలపాలై కదలలేని స్థితిలో ఉందని అన్నారు హరీష్ రావు. తెలంగాణలో పోలీసుల దమనకాండ కొనసాగుతోందని మండిపడ్డారు.
షాద్ నగర్ లో బంగారం దొంగతనం కేసులో దళిత మహిళ, ఆమె కొడుకుని.. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి దారుణంగా హింసించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణం పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇదెక్కడి ఘోరం అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహం వల్ల దళిత మహిళ తీవ్ర గాయాలపాలై కదలలేని స్థితిలో ఉందని అన్నారు హరీష్ రావు. తెలంగాణలో పోలీసుల దమనకాండ కొనసాగుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో దళితులపై అణచివేత నానాటికీ తీవ్రమవుతోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్య మరవకముందే మరియమ్మ తరహాలో సునీత అనే దళిత మహిళపై షాద్ నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారంటూ ఆయన ఓ వీడియోని రీట్వీట్ చేశారు. ఈ అమానుష సంఘటనపై వెంటనే విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు ప్రవీణ్ కుమార్.
సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత దంపతులను, వారి కొడుకుని పోలీసులు ఓ దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో బంగారం దొంగతనం చేశారనేది వీరిపై అభియోగం. ఈ కేసు విచారణకోసం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని సునీత ఆరోపిస్తోంది. తన కొడుకు చూస్తుండగానే మగ పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తీవ్రంగా గాయపరిచారని ఆమె అంటోంది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెపై మీడియాలో కథనాలు రావడంతో వెంటనే బీఆర్ఎస్ నేతలు స్పందించారు.