అశోక చక్రం కూడా తీసేస్తారా..? బీఆర్ఎస్ ఆందోళన
ఇంత జరిగినా ఇంకా ముందుకే వెళ్లారంటే మాత్రం తాము న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. వేసవి సెలవల తర్వాత కోర్టుల్లోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకుంటామని చెప్పారు.
రాచరిక చరిత్రను చెరిపేయాలంటే జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రాన్ని కూడా తీసివేస్తారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనా విధానం సరైనది కాదని విమర్శించారు. సోనియా గాంధీ ఇలాంటి ఆలోచనలకు ఎందుకు మద్దతిస్తున్నారని అడిగారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళ తోరణాన్ని తొలగించాలనే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సోనియా గాంధీ అడ్డుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదని, ఆయన ఆలోచనలను సోనియాగాంధీ నిలువరించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఖిలా వరంగల్ లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలనాదక్షతకు ప్రతీక అయిన కళా తోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తోందని విమర్శించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సహా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర పట్ల వ్యతిరేకత ఉందని, ఆయన సమైక్యవాది అని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా.. అని ప్రశ్నించారు. తెలంగాణను విచ్ఛిన్నం చేయాలనే శక్తులతో రేవంత్ రెడ్డి కలసిపోయారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పై మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. ఇంత జరిగినా ఇంకా ముందుకే వెళ్లారంటే మాత్రం తాము న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వేసవి సెలవల తర్వాత కోర్టుల్లోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకుంటామని చెప్పారు బీఆర్ఎస్ నేతలు.