చర్యకు ప్రతిచర్య తప్పదు -కేటీఆర్ హెచ్చరిక

రాష్ట్రంలో పిరికిపంద పాలన నడుస్తోందని, రైతులకు సమాధానం చెప్పలేని చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు కేటీఆర్. ధర్నాలు చేస్తున్న రైతులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, చివరికి మహిళా జర్నలిస్టులపై కూడా కాంగ్రెస్‌ గూండాలు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు.

Advertisement
Update:2024-08-24 08:12 IST

సోషల్‌ మీడియాలో రుణమాఫీ కాలేదని పోస్టు చేసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని.. ఇక నుంచి తాము కూడా అదే పద్ధతిలో స్పందిస్తామని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇదే విషయాన్ని తాము డీజీపీకి కూడా చెప్పామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. బీఆర్ఎస్ నేతలతో కలసి డీజీపీ జితేందర్ కి పరిస్థితి వివరించారు. వినతిపత్రం అందించారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని డీజీపీని కోరారు.


పదేళ్లు తమ పాలనలో శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలించామని, అంతకు ముందు 14 ఏళ్లపాటు కొట్లాడి తెలంగాణ సాధించామని.. చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నా, దారుణాలు చేస్తున్నా.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోటే తాము సంయమనంతో ఉన్నామని చెప్పారు. తమ సహనాన్ని, మంచితనాన్ని, తెలంగాణపై ఉన్న ప్రేమను చేతగానితనంగా భావించొద్దన్నారు. కేటీఆర్. కొంతమంది పోలీసులు మంత్రుల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ లు కోస్తూ, డ్యాన్సులు వేస్తూ పరశించిపోతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని తాము డీజీపీని కోరినట్టు చెప్పారు.

రుణమాఫీకోసం రైతులు ప్రశ్నిస్తుంటే దాడులు చేయడమేంటని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. రుణమాఫీ చేశామని చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉంటే.. సెక్యూరిటీ లేకుండా, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకోకుండా ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఆయన ఎక్కడికి పోదామంటే అక్కడికే వెళ్దామని, ఏ ఊరికి వెళ్లినా చారణా రుణమాఫీ కూడా కాలేదని ఆ విషయంలో రైతులు భగభగ మండుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ఊర్లలోకి వస్తే తరిమికొట్టాలని ప్రజలు చూస్తున్నారని అన్నారు. పోలీసులు, అధికారగణాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్.

రాష్ట్రంలో పిరికిపంద పాలన నడుస్తోందని, రైతులకు సమాధానం చెప్పలేని చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు కేటీఆర్. ధర్నాలు చేస్తున్న రైతులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, చివరికి మహిళా జర్నలిస్టులపై కూడా కాంగ్రెస్‌ గూండాలు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే, 50 మంది కిరాయి మూకలు, కాంగ్రెస్‌ గూండాలు పోలీసులతో కలిసి రైతులపై దాడి చేశారని, గుడ్లు, రాళ్లు, చెప్పులు వేసి రైతులను తీవ్రంగా అవమానించారని వివరించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు సైతం రైతుల నిరసన శిబిరం టెంట్లు కూల్చివేసి, రాళ్లు రువ్వి.. ఆ గూండాలకు వత్తాసు పలికారని చెప్పారు. పిరికిపంద పాలనకు ఇదే నిదర్శనం అన్నారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News