దేశంలో బీజేపీపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే : కే. కేశవరావు

బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీజేపీపై పోరాడుతున్నది. పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం పెట్టిన అనేక బిల్లులను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కూడా ఎన్డీయే అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని కేశవరావు గుర్తు చేశారు.

Advertisement
Update:2023-07-03 16:53 IST

బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనడం పరిణితి లేని వ్యాఖ్యలని బీఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు, ఎంపీ కే. కేశవరావు అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీజేపీపై పోరాడుతున్నది. పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం పెట్టిన అనేక బిల్లులను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కూడా ఎన్డీయే అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని కేశవరావు గుర్తు చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ, విపక్షాల కూటమిలో బీఆర్ఎస్ ఉంటే మేము కూర్చోమని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. అక్కడే ఆయన రాజకీయ పరిణితి ఏంటో అర్థం అవుతోందని అన్నారు.

ఒక పార్టీ ఉంటే తాము అక్కడ ఉండమని చెప్పడం ప్రజాస్వామ్యంలో హాస్యాస్పదం అవుతుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు వస్తే అన్నింటినీ కలుపుకొని పోవాలి. అలా కలిసిన పార్టీల్లోని ఒక మంచి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకొని ముందుకు వెళ్లాలి. అంతే కానీ.. ఇలా అర్థరహితమైన వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ తన రాజకీయ అపరిపక్వతను బయట పెట్టుకోవద్దని కేశవరావు హితవు పలికారు.

దేశంలో గవర్నర్ల వ్యవస్థపై కేశవరావు మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కానీ దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లే రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూశాము. సుప్రీం తీరుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని వస్తే అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. బీఆర్ఎస్ కూడా బీజేపీ తెచ్చిన ఆర్డినెన్స్‌ను బహిరంగంగా వ్యతిరేకించింది. సీఎం కేసీఆర్ దీనిపై ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారని కేశవరావు అన్నారు. 

Tags:    
Advertisement

Similar News