మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
కర్నాటకలో ప్రజలకు ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ ని ఎన్నుకున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. బీజేపీపై ప్రజలకు కక్కొస్తే కాంగ్రెస్ ని గెలిపించారని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కార్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. కొన్ని పార్టీలు ఎన్నికల టైమ్ రాగానే నోటికొచ్చినట్టు వాగ్ధానాలు చేస్తుంటాయని విమర్శించారు. నినాదాలు ఇచ్చే పార్టీలు ఎక్కువగా ఉంటాయని, ఆ నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. తెలంగాణ భవన్ లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ ఈ రోజు బీఆర్ఎస్ లో చేరారు. దళిత జాతి మేలు కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి యాతాకుల భాస్కర్ అని అన్నారు హరీష్ రావు. దళితుల అభివృద్ధి కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు భాస్కర్ సహా అనేక మంది నాయకుల్ని ఆకట్టుకుంటున్నాయి చెప్పారు హరీష్ రావు.
బీజేపీపై ప్రజలకు కక్కొస్తే కాంగ్రెస్ గెలిచింది..
కర్నాటకలో ప్రజలకు ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ ని ఎన్నుకున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. బీజేపీపై ప్రజలకు కక్కొస్తే కాంగ్రెస్ ని గెలిపించారని అన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇస్తున్న హామీలు, ఆయన సొంత రాష్ట్రం కర్నాటకలో అమలు కావడం లేదని గుర్తు చేశారు.
అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ఖమ్మంలో చదివి వెళ్లిపోయారని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ముందు బీజేపీ గుజరాత్ గుడ్డి పాలన సరిచేసుకోవాలని హితవు పలికారు. గిరిజనుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ, కాంగ్రెస్ కి లేదని చెప్పారు హరీష్ రావు. తండాలను గ్రామాలుగా మార్చామని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి నమ్మదని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత కలహాలు, కరెంట్ సమస్యలు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు.
ఇది సెల్ఫ్ డిక్లరేషన్..
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఊరూవాడా చేస్తున్న తీర్మానాల గురించి గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని, బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని వెల్లడించారు. అంబేద్కర్ మార్గంలో నడుస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ మాత్రమేనని స్పష్టం చేశారు.
♦