కవిత అరెస్టుపై మొదటిసారి స్పందించిన కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నించాడని కేసీఆర్ అన్నారు. బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మొదటిసారి స్పందించారు మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్. కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమం అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్టు చేశారని మండిపడ్డారు. కేసులో కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఎల్ సంతోష్‌పై కేసు పెట్టకపోయి ఉంటే..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నించాడని కేసీఆర్ అన్నారు. బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారన్నారు. ఈ క్రమంలోనే దుర్మార్గుడైన మోదీ.. బీఆర్ఎస్‌పై కక్ష కట్టారన్నారు కేసీఆర్. అందుకే తన కూతుర్ని కుట్రపూరితంగా మనీలాండరింగ్ కేసులో ఇరికించారన్నారు. కవితపై ఎలాంటి కేసు లేదన్న కేసీఆర్.. కక్ష కట్టే అరెస్టు చేశారని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్‌పై తాము కేసు పెట్టకపోయి ఉంటే.. ఈరోజు కవిత అరెస్టు ఉండకపోయేదన్నారు కేసీఆర్.
త్వరలోనే పాత కేసీఆర్...
త్వరలోనే మళ్లీ పాత కేసీఆర్‌ను చూడబోతున్నారని.. ఉద్యమకాలం నాటి నాయకుడిని చూస్తారంటూ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు గులాబీ బాస్. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ సర్కారు మనుగడ కష్టమేనని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కనీసం 8 సీట్లు వస్తాయన్నారు. మరో మూడింటిలోనూ గెలుపు అవకాశాలున్నాయని తెలిపారు. జనం నుంచి మంచి స్పందన వస్తుండటంతో బస్సుయాత్ర కూడా చేద్దామని నేతలతో చెప్పారు కేసీఆర్. ఇప్పుడున్న రేవంత్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ వ్యతిరేతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్.