బీజేపీ కార్నర్ మీటింగ్స్ అట్టర్ ఫ్లాప్.. జనాలు లేక.. నేతలు డుమ్మా!

హైదరాబాద్ నగరంలో రద్దీ గల్లీల్లో కార్నర్ మీటింగ్స్‌కు జనాలు వచ్చినట్లే అనిపించింది. కానీ అసలు ఈ కార్నర్ మీటింగ్స్ సత్తా ఏంటో జిల్లాల సమావేశాలు చూస్తే కాని అర్థం కాదు.

Advertisement
Update:2023-02-21 18:03 IST

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి జాతీయ నాయకత్వం ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. ఇక్కడి నాయకుల తీరుతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తూ.. ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. క్షేత్ర స్థాయిలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీని బలోపేతం చేయడానికి ఇటీవల మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేసింది. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 11000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టాలని డిసైడ్ చేసింది. గత 10 రోజులుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి.

'ప్రజా గోస-బీజేపీ భరోసా' పేరుతో ప్రతీ రోజు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. మొదట్లో ఒకటి రెండు చోట్ల జనాలు బాగానే కనపడ్డారు. హైదరాబాద్ నగరంలో రద్దీ గల్లీల్లో కార్నర్ మీటింగ్స్‌కు జనాలు వచ్చినట్లే అనిపించింది. కానీ అసలు ఈ కార్నర్ మీటింగ్స్ సత్తా ఏంటో జిల్లాల సమావేశాలు చూస్తే కాని అర్థం కాదు. బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ చప్పగా సాగుతున్నాయి. కనీసం ఆ వీధిలో ఉండే ప్రజలు కూడా సమావేశాల వైపు కన్నెత్తి చూడటం లేదని అంటున్నారు. నాయకులు వచ్చి మాట్లాడుతున్నా.. జనాలు లేకపోవడంతో.. పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు.

స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌లో మాట్లాడటానికి ఏకంగా 800 మంది నాయకులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఏయే అంశాలపై మాట్లాడాలనే విషయాలను వారికి నేర్పించారు. ఎంతో ఉత్సాహంగా స్పీచ్ ఇద్దామని వెళ్తున్న నాయకులకు.. అక్కడ ప్రజలు కనపడక పోయే సరికి నిరుత్సాహ పడుతున్నారు. రెండు మూడు మీటింగ్స్ చూసిన తర్వాత.. నాయకులు కూడా డుమ్మా కొడుతున్నట్లు సమాచారం. ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను స్వయంగా సునీల్ బన్సల్ పర్యవేక్షిస్తున్నారు. ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు తెప్పించుకొని విశ్లేషిస్తున్నారు.

చాలా మంది బీజేపీ నాయకులు ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌కు డుమ్మా కొడుతున్నట్లు సునిల్ బన్సల్ తెలుసుకున్నారు. ఇప్పటికే వారందరికీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైనా సరే వీధి సమావేశాలను విజయవంతం చేయాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన చెప్పారు. గతంలో ఇలాగే యూపీలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించి విజయం సాధించామని.. అప్పట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తొమ్మిది మంది జిల్లా అధ్యక్షులను బాధ్యతల నుంచి తప్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా నాయకులకు చెబుతున్నారు.

తొలి దశలో చేపట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌కే ఆదరణ లేకపోతే.. ఇక మండల స్థాయిలో నిర్వహించాల్సిన ర్యాలీలు, జిల్లా కేంద్రాల్లో చేయాల్సిన సభలు, సమావేశాలకు ఇంకేం ఆదరణ ఉంటుందని పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఇప్పటికైనా మేల్కొని జన సమీకరణ చేయాలని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని రాష్ట్ర నాయకులకు సూచింది. దీంతో మిగిలిన కార్యక్రమాలైనా విజయవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ మాత్రం అట్టర్ ఫ్లాప్‌గా మారి తెలంగాణ బీజేపీని ఇబ్బందికి గురి చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News