బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల.. సోషల్ మీడియాలో సూపర్ కామెడీ

సెకండ్ లిస్ట్ అనగానే ఆశావహులు చాలామంది తమ పేర్లు ఉంటాయేమోనని వేచి చూశారు. చివరకు ఆ లిస్ట్ చూసి అందరూ షాకయ్యారు.

Advertisement
Update:2023-10-27 18:45 IST
బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల

బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల

  • whatsapp icon

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. లిస్ట్ అంటే ఆ లిస్ట్ లో ఎన్ని పేర్లుంటాయో అనుకునేరు, పేరుకి సెకండ్ లిస్ట్ అయినా అందులో ఒకే ఒక్క పేరుంది. ఆ మాత్రానికి దానికి జాబితా అని పేరు పెట్టడమెందుకు, ప్రత్యేకంగా విడుదల చేయడమెందుకు..? ఇవే ప్రశ్నలు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. బీజేపీ సెకండ్ లిస్ట్ పై జోరుగా ట్రోలింగ్ జరుగుతోంది.


ఆ ఏక్ నిరంజన్ ఎవరంటే..?

సెకండ్ లిస్ట్ లో పేరు దక్కించుకున్న ఒకే ఒక్కడు మిథున్ కుమార్ రెడ్డి. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి మిథున్ ని బరిలో దింపుతున్నామంటూ బీజేపీ జాబితా విడుదల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరుతో ప్రకటన విడుదలైంది. సహజంగా సెకండ్ లిస్ట్ అనగానే ఆశావహులు చాలామంది తమ పేర్లు ఉంటాయేమోనని వేచి చూశారు. చివరకు ఒకే ఒక్క పేరు ఆ లిస్ట్ లో కనపడటంతో బీజేపీ నేతలే షాకయ్యారు.

ఈ ట్విస్ట్ ఏంటి..?

ఇటీవల 52 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ ఎంపీలకు కూడా ఇందులో సీట్లు ఖరారు చేసింది. గజ్వేల్‌, హుజూరాబాద్‌ రెండు స్థానాల నుంచి ఈటల రాజేందర్‌ ను పోటీకి దింపడం ఈ లిస్ట్ లో మరో ప్రత్యేకత. సెకండ్ లిస్ట్ లో కూడా ఏమైనా ప్రత్యేకతలుంటాయేమోనని చూసిన వారికి పూర్తి నిరాశే ఎదురైంది. ఒకే ఒక్కరితో లిస్ట్ విడుదల చేయడమే అందులో ప్రత్యేకత. తీవ్ర మేథోమథనం చేసి జాబితా తయారు చేస్తున్నారని అనుకోవాలా..? లేక బీజేపీకి అభ్యర్థులు దొరకడంలేదని అనుకోవాలా..? సెకండ్ లిస్ట్ తర్వాత చాలా అనుమానాలు మొదలయ్యాయి. బీజేపీ కొత్త లిస్ట్ అనే ప్రకటన వస్తే.. ఈసారి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు.. ఎవరెవరికి ఏయే సీట్లు అని అడగడానికి బదులు, అసలు ఎన్నిసీట్లతో లిస్ట్ విడుదల చేశారు అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించడం ఖాయం.

Tags:    
Advertisement

Similar News