మా పార్టీలోకి వ‌స్తే మీరే అభ్య‌ర్థి.. బీఆర్ఎస్ నేత‌ల‌పై బీజేపీ, కాంగ్రెస్ న‌జ‌ర్‌

బీజేపీ తొలి జాబితాలో ప్ర‌క‌టించిన 9 ఎంపీ టికెట్ల‌లో రెండు రోజుల కింద‌టే ఆ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత‌లున్నారు. నాగ‌ర్‌క‌ర్నూలు ఎంపీ పి.రాములు బీజేపీలో చేరిన రెండు రోజుల‌కే త‌న కుమారుడికి బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు.

Advertisement
Update:2024-03-04 18:04 IST

తెలంగాణ‌లో ప‌దేళ్లు అధికారం అనుభ‌వించిన బీఆర్ఎస్ నేత‌లు మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోగానే త‌మ దారి తాము చూసుకుంటున్నారు. ఇదే అద‌నుగా కాంగ్రెస్‌, బీజేపీ ఆయా నేత‌ల‌పై దృష్టిపెట్టాయి. బ‌ల‌మైన నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుని రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టికెట్లివ్వ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ ఓ అడుగు ముందంజలో ఉండగా, కాంగ్రెస్ కూడా అదే బాట‌లో వెళుతోంది.

ఇద్ద‌రికి టికెట్లు ఇచ్చేసిన బీజేపీ

బీజేపీ తొలి జాబితాలో ప్ర‌క‌టించిన 9 ఎంపీ టికెట్ల‌లో రెండు రోజుల కింద‌టే ఆ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత‌లున్నారు. నాగ‌ర్‌క‌ర్నూలు ఎంపీ పి.రాములు బీజేపీలో చేరిన రెండు రోజుల‌కే త‌న కుమారుడికి బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. జ‌హీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీపాటిల్ ఇలా బీజేపీలో చేర‌డం.. అలా జ‌హీరాబాద్ టికెట్ సంపాదించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇంకా మరింత మంది బీఆర్ఎస్ నేత‌లు వ‌స్తార‌నే ఉద్దేశంతోనే మిగిలిన 8 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌కుండా క‌మ‌లం పార్టీ పెండింగ్‌ పెట్టింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ బీజేపీలోకి వ‌స్తే వ‌రంగ‌ల్ ఎంపీ సీటు ఇవ్వాల‌న్న యోచ‌నా ఇందులో భాగ‌మే.

కాంగ్రెస్ కూడా..

మ‌రోవైపు తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నేత‌లకు డోర్లు తెరిచింది. ఇప్ప‌టికే పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహ‌న్ పేరును సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తోంది. అలాగే మొన్న‌నే పార్టీలో చేరిన ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇచ్చే అవ‌కాశాలు బ‌లంగా ఉన్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రోజుల ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసి ఓడిపోయిన మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు పేరు మ‌ల్కాజ్‌గిరి అభ్య‌ర్థిగా గ‌ట్టిగా వినిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News