కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేయబోతున్నారు? ఢిల్లీలో ఆసక్తికర భేటీలు!

శుక్రవారం ఉదయం 11 గంటలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2022-12-15 16:37 IST

కాంగ్రెస్‌కు చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొన్నాళ్లుగా పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ తరపున మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నం చేయని వెంకటరెడ్డి.. పరోక్షంగా తమ్ముడికి సహకారం అందించారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతికి అండగా ఉంటానని చెప్పి.. చివరకు హ్యాండ్ ఇచ్చారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఏఐసీసీ వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసుకు కూడా జారీ చేసింది. కానీ ఆయన మాత్రం ఆ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇటీవల అధిష్టానం ప్రకటించిన తెలంగాణ పీసీసీ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు గల్లంతు అయ్యింది. షోకాజ్ నోటీసుకు స్పందించనందుకే ఆయనను పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. పార్టీని వీడాలని వెంకటరెడ్డి ఆలోచిస్తున్నారని.. అందుకే పార్టీ నోటీసు పంపించినా బేఖాతరు చేశారనే వార్తలు వచ్చాయి.

అయితే, వెంకటరెడ్డి అకస్మాతుగా బుధవారం ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. నేరుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోతుండటం వంటి అంశాలపై తాను ఖర్గేతో చర్చించానని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని కూడా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఖర్గేతో భేటీ అయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలంగాణ నేతలతో కూడా త్వరలోనే కలిసి మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చారు.

గురువారం కూడా ఢిల్లీలోనే ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు ప్రధానిని కలువనున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయనకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పీఎంవో ఆ మేరకు వెంకటరెడ్డికి సమాచారం ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మోడీ, వెంకటరెడ్డి భేటీ తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. నిన్ననే ఖర్గేను కలిసిన వెంకటరెడ్డి.. రేపు మోడీని ఎందుకు కలువబోతున్నారనే ఆసక్తి నెలకొన్నది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాలుష్యం కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని మోడీ దృష్టికి వెంకటరెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తున్నది. నమామి గంగా తరహాలో నమామి మూసీ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఆయన మోడీని కోరతారని సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించిన అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ అంశాన్ని కూడా మోడీ వద్ద ప్రస్తావిస్తారని తెలుస్తోంది.



Tags:    
Advertisement

Similar News