బీసీ సీఎం.. బీజేపీ నయా తంత్రం

పిట్టకథలోని ముసలావిడ లాగే సూర్యాపేట సభలో హామీ ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారాయన.

Advertisement
Update:2023-10-27 18:15 IST

బీసీ సీఎం.. బీజేపీ నయా తంత్రం: అమిత్ షా

ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ గురించి సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో ఓ పిట్టకథ చెబుతూ వచ్చారు. సూది పోగొట్టుకున్న ఓ ముసలావిడ అది దొరికితే దేవుడికి పదికేజీల చక్కెర ఇస్తానని మొక్కుకుందనేది ఆ కథ. సూదికోసం అంత పెద్ద ముడుపేంటని ఇంట్లోవాళ్లు అడిగితే.. అది దొరికితే తర్వాత సంగతి చూద్దాం అనేదట. కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉందని, అందుకే ఎక్కడలేని హామీలన్నీ ఇస్తుంటాయని చెప్పారు కేసీఆర్. సరిగ్గా ఈ పిట్టకథలోని ముసలావిడ లాగే సూర్యాపేట సభలో హామీ ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారాయన.


బీజేపీ మాట ఇస్తే తప్పదన్న అమిత్ షా.. బీసీని ముఖ్యమంత్రిని చేసి తీరతామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు అమిత్ షా. సమగ్రమైన అభివృద్ధి మోదీ ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు. వరంగల్ లో సమ్మక్క సారక్క ట్రైబల్ వర్శీటీ ఏర్పాటు చేసిన ఘనత తమదేనన్నారు. పసుపు రైతులకు కోసం బోర్టు ఏర్పాటు చేశామని, కృష్ణా నీళ్లలో తెలంగాణ హక్కుల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తాయి కాబట్టి.. ఆ పార్టీల హామీలను నమ్మొద్దని చెప్పారు అమిత్ షా. ఆ పార్టీలు రెండూ పేదలకు, బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నారు. బీజేపీ మాత్రమే బీసీల పక్షపాతి అని చెప్పారు అమిత్ షా. మొత్తమ్మీద సూర్యాపేట సభలో బీసీలకు పెద్దదిక్కు తామేనని చెప్పే ప్రయత్నం చేశారాయన. బీసీ ముఖ్యమంత్రి అనే విషయంలో అమిత్ షా ఇచ్చిన హామీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీసీని తెలంగాణ పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పించిన బీజేపీ.. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనే పల్లవి అందుకోవడం హాస్యాస్పదం అంటున్నారు నెటిజన్లు.

Tags:    
Advertisement

Similar News