ఆడియో క్లిప్పింగ్స్ రచ్చ.. ఆర్థిక మంత్రిని తొలగించనున్న ఎంకే స్టాలిన్?

సొంత ప్రభుత్వంపై తన కేబినెట్ మంత్రే ఆరోపణలు చేయడంతో సీఎం స్టాలిన్ చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2023-05-09 10:04 IST

తమిళనాడు డీఎంకే ప్రభుత్వంలో తొలి వేటు పడే అవకాశాలు ఉన్నాయి. సీఎం ఎంకే స్టాలిన్ తన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న పలనివేల్ తియగరాజన్ (పీటీఆర్)కు ఉద్వాసన చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులపై పీటీఆర్ పలు అవినీతి ఆరోపణలు చేసిన ఆడియో క్లిప్స్ బయటపడ్డాయి. ఈ క్రమంలో పీటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించాలని స్టాలిన్ నిర్ణయించుకున్నట్లు స‌మాచారం..

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఇటీవల ఆడియో క్లిప్స్ విడుదల చేశారు. 'డీఎంకే ఫైల్స్' పేరుతో ఈ క్లిప్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందులో ఆర్థిక మంత్రి పీటీఆర్.. డీఎంకే పార్టీని కించపరుస్తూ, స్టాలిన్ కుటుంబంపై పలు ఆరోపణలు చేస్తున్నట్లు వినిపించింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో దోచుకున్న సొమ్ములో ఎక్కువ భాగం స్టాలిన్ కొడుకు, అల్లుడికే పోయిందని అందులో పీటీఆర్ అన్నట్లుగా ఉన్నది. క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, అల్లుడు శబరీశన్ కలిసి రూ.30వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అందులో పీటీఆర్ ఆరోపించారు. ఈ క్లిప్స్ బయటకు వచ్చిన దగ్గర నుంచి డీఎంకేపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

సొంత ప్రభుత్వంపై తన కేబినెట్ మంత్రే ఆరోపణలు చేయడంతో సీఎం స్టాలిన్ చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి పీటీఆర్‌ను తొలగించి.. ఆ స్థానంలో టీఆర్‌బీ రాజాను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మన్నార్‌గుడి నియోజకవర్గానికి చెందిన టీఆర్‌బీ రాజా తండ్రి టీఆర్ బాలు గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. శంకరన్ కోవిల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాజాను కూడా కేబినెట్‌లో తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, తమిళనాడు చీఫ్ అన్నామలై విడుదల చేసిన ఆడియో క్లిప్పులపై ఆర్థిక మంత్రి పీటీఆర్ స్పందించారు. తాను స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, అల్లుడు శబరీశన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. బీజేపీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని వాయిస్ ఛేంజ్ చేసి.. చీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News