అసెంబ్లీని గాంధీభవన్‌ లా మార్చేశారు

గురుకులాలు, హాస్టళ్లలో 54 మంది విద్యార్థులు చనిపోయిన పరామర్శించలేదు : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-12-21 18:50 IST

అసెంబ్లీని సీఎల్పీలా, గాంధీభవన్‌ లా మార్చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. శనివారం సాయంత్రం బీఆర్‌ఎస్‌ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గురుకులాలు, హాస్టళ్లలో 54 మంది విద్యార్థులు చనిపోతే వారిలో ఒక్కరిని కూడా పరామర్శించలేదన్నారు. ఎస్టీ గురుకులం విద్యార్థి శైలజ అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా ఎమ్మెల్యే కోవా లక్ష్మీని హౌస్‌ అరెస్ట్‌ చేశారన్నారు. ''అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి అబద్ధాలతోనే పరిపాలన చేస్తున్నడు.. మూసీ కంపుకంటే ఈ ముఖ్యమంత్రి చెప్పే కంపే ఎక్కువ.. ఏడాదిగా చేసిందేమీ లేదు, అబద్ధాల పాలన సాగిస్తున్నరు, ఇక ఆ దేవుడే ఈ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలే.. రైతు భరోసా ఎప్పుడిస్తారో, ఎంతిస్తారో చెప్పలేదు.. రుణమాఫీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.. అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నరు.. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తేలిపోయింది.. ముఖ్యమంత్రి కడుపులున్నది అంతా కక్కిండు.. ఒక్క స్కూలు కట్టిన్రా అని సీఎం మాట్లాడిండు.. నీకేం తెలుసు, ఏ నియోజకవర్గానికి పోదాం పద, చూపెడతం.. మేం ఫార్మా సిటీలో ఏ కంపెనీకైనా ఒక్క ఎకరం ఇవ్వలేదు, కానీ అగ్గువకు కంపెనీలకు కేటాయించినట్లు అబద్ధాలు చెప్తున్నడు.. ప్రతి సబ్జెక్టులో అబద్ధాలే.. నోటికొచ్చినట్లు, సొల్లు వాగుడు.. సిగ్గులేదు.. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామంటే మేం వద్దంటున్నమట? ఆర్ఆర్ఆర్ వద్దంటున్నమట, ప్రాజెక్టులు వద్దన్నమట.. అసెంబ్లీ సాక్షిగా ఇన్ని పచ్చి అబద్దాలాడిన ముఖ్యమంత్రిని మేం చూడలేదు..'' అని మండిపడ్డారు.

15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే, నేను రాజీనామా చేస్తా అని బల్లగుద్ధి ఛాలెంజ్ చేశానని.. సీఎం హామీని ఎగబెట్టి రైతులను మోసం చేశారని అన్నారు. ''ఉల్టా చోర్ కొత్వాల్ కు ఢాంటే అన్నట్లున్నది నీ కథ.. ముఖ్యమంత్రివన్నీ చావు తెలివితేటలు.. ఆరిపోయే దీపానికి వెలుతురెక్కువ అంటరు అందుకే.. గొంతు పెంచుకొని చెప్తే, నీ మాటల గారడీని ప్రజలు నమ్మరు.. పంటల బీమాపై మంత్రి తుమ్మల చేతులెత్తేసిండు.. ఎస్‌ఎల్బీసీ మేం 11 కిలోమీటర్లు తవ్వితే, ఒక్క కిలోమీటరు తవ్వలేదంటడు.. మెడికల్ కాలేజీలు, గురుకులాలు ఇట్లా మేం ఎన్నో చేసినం.. మూసీ కాలుష్యం పాపం 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏండ్ల తెలుగుదేశం పాలన ఫలితమే.. నాలుగైదు వేల కోట్లు ఖర్చుపెట్టి మూసీ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టినం.. లగచర్లకు పోదాం పద, మూసీ ప్రారంభమైన దగ్గరి నుంచి పోదాం పద.. వాస్తవాలు చెబుతరని స్పీకర్ మాకు మైకు కూడా ఇవ్వడం లేదు.. అప్పుల గురించి ముఖ్యమంత్రి తప్పులు మాట్లాడుతున్నరు.. ఆ విషయాన్ని క్లారిఫై చేద్దామంటే మైక్ ఇస్తలేరు.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమే.. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పులకు మేం మిత్తీలు కట్టినం..'' అని తెలిపారు.

కేసీఆర్‌ పాలనలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంటు ఇట్లా ఎన్నో పథకాలు ఇచ్చామన్నారు. తాము అభివృద్ధి పనులు చేశామనిజజ వాళ్లకు చేతగాక ప్రజల ముందుకు పోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజల ముందు బయట పెట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన రిపోర్టులోనే కాళేశ్వరం ద్వారా 20 లక్షల 30 వేల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చిందని తెలిపిందని, సీఎం సభలో 50 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ''పరిశ్రమలకు నీళ్లిస్తున్నది కూడా కాళేశ్వరమే.. ఆ ప్రాజెక్టే లేకపోతే, మల్లన్నసాగర్ లేదు, నువ్వు హైదరాబాదుకు తెస్తమన్న 20 టీఎంసీల నీళ్లు లేవు.. కాసిం రజ్వీ లెక్క, ఒక రాజు లెక్క, నియంత లెక్క చేస్తున్నవు.. హైటెక్ సిటీ అమ్మిండ్లు అంటవు.. గోబెల్స్ ఉంటే రేవంత్ అబద్ధాలు చూసి ఉరిబెట్టుకొనేటోడు..'' అన్నారు. ''సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడం బాధాకరమే.. కొండారెడ్డిపల్లిలో నీ తమ్ముళ్ల వేధింపుల వల్ల మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, కేసు పెట్టలేదు.. వాంకిడి హాస్టల్లో గిరిజన విద్యార్థి శైలజ మరణిస్తే నువ్వుగానీ, నీ మంత్రులకు గానీ పరామర్శించే తీరిక లేదా? మా ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించడానికి వెళుతుంటే అర్ధరాత్రి అరెస్టు చేయించడం దుర్మార్గం కాదా?'' అని మండిపడ్డారు.

అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం అన్నీ అబద్ధాలు చెప్పిందన్నారు. మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపణలు చేశారని.. ఆయన నిర్వహిస్తున్న ఇరిగేషన్‌ శాఖలోనే 2 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. అసెంబ్లీలో చర్చలకు ప్రభుత్వం పారిపోయిందన్నారు. ఏడాది పాలనలో 54 మంది విద్యార్థులు మరణించారని తెలిపారు. 89 మంది ఆటో డ్రైవర్లు, 29 మంది నేత కార్మికులు, 450 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వెయ్యికి పైగా రేప్‌ కేసులు నమోదయ్యాయని.. 390 ప్రొటెస్టులు జరిగాయని తెలిపారు. రేవంత్ తన పాలనలో తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సభలో 2 గంటలు మాట్లాడి ఒక్కటంటే ఒక్క నిజం చెప్పలేదన్నారు. ''సోనియాను బలిదేవత అన్నది నువ్వే, కాళ్లుపట్టుకొన్నది నువ్వే.. అధికారపక్షమైతే అందరికీ మైకు ఇస్తున్నరు.. మాకివ్వడం లేదు.. మంత్రి కోమటిరెడ్డి ఏం చెబుతున్నడో ఆయనకే తెల్వదు.. మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి అంగీపట్టుకొని గుంజినా కోమటిరెడ్డి కూర్చోవడం లేదు.. చట్టసభలపై వీరెవరికీ గౌరవం లేదు.. పతివ్రత పరమాన్నం వండితే.. తెల్లారెదాకా సల్లారలేదట అన్నట్లున్నది రేవంత్ తీరు.. రేవంత్ పాలనంతా అవినీతి మయమే.. బిల్లులు పాస్‌ కావాలంటే 8 పర్సెంట్ ఇవ్వాల్సిందే.. మేం ఈ సభలో కాంగ్రెస్ అబద్ధాలను ఎండగట్టాం..'' అన్నారు.

Tags:    
Advertisement

Similar News