కుల గణనపై రేవంత్ సర్కార్ పీచేమూడ్
రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) గురించి అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతలోనే పీచేమూడ్ అన్నది. దేశానికే ఆదర్శప్రాయంగా సర్వే చేశామని గొప్పలకు పోయే ప్రయత్నం చేసి భంగపడింది. తెలంగాణ సర్వేను దేశం ఆదర్శంగా తీసుకోవాలని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నవ్వుల పాలు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మారదు అని ఈసడించుకునేలా చేసింది. కుల గణన రీ సర్వే అంటూనే కండీషన్స్ అప్లయ్ అంటూ మరో ఫీట్ కు తెరతీసింది. బుధవారం సాయంత్రం వరకు తాము చేసిన కులగణన సర్వే నూటికి నూరుపాళ్లు నిజమైనదని చెప్పుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని 3.1 శాతం మంది కోసం మళ్లీ సర్వే చేస్తామని ప్రకటించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సెక్రటేరియట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. కులగణన సర్వే తప్పుల తడక అని.. కేసీఆర్ ప్రభుత్వం 2014లో చేసిన సర్వే కన్నా ఇప్పుడు బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే ఆయన నోరు మూయించే ప్రయత్నం చేశారు. సర్వేలో పాల్గొనని వారికి దానిపై మాట్లాడే హక్కు లేదని స్పీకర్ చైర్ ను సభా నాయకుడి హోదాలో రేవంత్ రెడ్డి డిక్టేట్ చేసిన వైనం సమాజమంతా కళ్లారా చూసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొత్తం ఒక ప్రహసనంగా సాగింది. ప్రభుత్వానికి అవసరం లేని వివరాలెన్నో సర్వేలో పొందు పరచడంతో ఏ ఒక్కరూ కూడా తమ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లు సబ్మిట్ చేసిన ఫాంలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఆస్తులు, అంతస్తులు ఉన్నోళ్లే కాదు.. పేదవాళ్లు సైతం తమ ఆస్తులు, అప్పుల వివరాలు మీకెందుకని ఎన్యూమరేటర్లను ప్రశ్నించారు. దీంతో సర్వే మొత్తం కుటుంబ సభ్యుల పేర్లు, వారిలో ఒకరి ఫోన్ నంబర్.. తమకు తాముగా ఎవరైనా చెప్పేందుకు ముందుకు వస్తే ఆధార్ కార్డ్ నంబర్ నమోదు దగ్గరే ఆగిపోయింది. సర్వేలో ప్రభుత్వం అడిగిన అనేక వివరాలను ప్రజలు వెల్లడించలేదు. దీంతో కొందరు ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఇండ్లకు వెళ్లకుండానే వారి వివరాలను నమోదు చేశారు. దాని ఫలితమే సర్వే మొత్తం తప్పుల తడకగా మారింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. సర్వే పక్కదారి పట్టిందనే విషయాన్ని ప్రభుత్వ వర్గాలు, ఇంటెలిజెన్స్ అలర్ట్ చేశాయో లేదో తెలియదు. ఆ సర్వేనే ఒక దివ్య ఔషధమని నమ్మించడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొక్కాబోర్లా పడింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పలుచబడేలా చేసింది. ముందే అలర్ట్ అయి సర్వే సందర్బంగా సేకరించాలని అనుకుంటున్న వివరాల విషయంలో కొంత వెనక్కి తగ్గి కేవలం వ్యక్తిగత వివరాలు, కులం వరకే సేకరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ విషయం తెలిసినా అధికార మిషలో ఒప్పుకోలేకపోయారు. సర్వే వివరాలు బయటకు వచ్చాక ప్రజాగ్రహం వెళ్లువెత్తడంతో మళ్లీ రీ సర్వే అని చెప్పి ప్రభుత్వం పరువును, కాంగ్రెస్ పార్టీ పరువును మూసీలో కలిపేశారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదిక ప్రవేశ పెట్టడానికే ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు చేసిన సర్కస్ ఫీట్లు ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పించాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీని సమావేశ పరుస్తామని చెప్పి.. రెండంటే రెండే నిమిషాల్లో సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయారు. కారణం.. ఆ సర్వే అనే బ్రహ్మపదార్థంలో ఏముందో కేబినెట్‌లో ఏ ఒక్కరికి తెలియదు. అయినా దానికి ఆమోదం తెలిపి సభ ముందుకు తెచ్చారు. కేవలం సర్వే వివరాలు వెల్లడించి మమ అనిపించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చారు కదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే .. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం.. మీకు ఇచ్చే దమ్ముందా అని బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అది చెప్పడానికి అసెంబ్లీ పెట్టడం ఎందుకు..? బీసీలకు చట్టసభల్లో సీట్లు ఇచ్చి ఇదిగో తాము అమలు చేశామని చెప్తే పోయేది. అసెంబ్లీలో చట్టం చేయకుండానే ఉట్టుట్టి ముచ్చట్లతోనే సభ ముగించారు. ఆ సర్వేను పట్టుకొని ముందుకు వెళ్దామంటే న్యాయ వివాదాలు వస్తాయనే భయం.. యథాతథంగా అమలు చేస్తామంటే బీసీలు తిరగబడి అధికార పీఠం నుంచి ఎక్కడో కూలదోస్తారోననే ఆందోళన.. వెరసి మళ్లీ సర్వే చేస్తామని ప్రకటన. ప్రభుత్వానికి రీ సర్వే చేసే ఉద్దేశమే ఉంటే.. ఈనెల 14న గాంధీ భవన్‌లో కుల గణనపై పీసీసీ చీఫ్ ఎందుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని ప్రకటించారు? దానికి సీఎం, డిప్యూటీ సీఎం సహా ముఖ్య నేతలంతా ఎందుకు వస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్.. ప్రభుత్వానికి ఇంకో స్టాండ్ ఉందని అనుకోవాలా లేక పీసీసీకి ప్రభుత్వానికి పొసగడం లేదని ఊహాగానాలు చేసుకోవాల్నో ఢిల్లీ పెద్దలే చెప్పాలే. మొత్తానికి రేవంత్ రెడ్డి తాను నగుబాటుకు గురయ్యి.. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ.. మల్లికార్జున ఖర్గేను.. కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేశాడు.