కాంగ్రెస్ నాయకత్వంపై ప్రాంతీయ శక్తుల అవిశ్వాసం
ఇండియా కూటమికి దూరం జరుగుతోన్న పార్టీలు
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రాంతీయ రాజకీయ శక్తుల విశ్వాసం సన్నగిల్లుతోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ దెబ్బతీయడంతో హస్తం పార్టీ అంటేనే బాబోయ్ అనే పరిస్థితి నెలకొన్నది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇదివరకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ క్లారిటీ ఇవ్వగా.. ఇప్పుడు ఆ పార్టీలో నంబర్ టు, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఇదే విషయం పునరుద్ఘాటించారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయబోమని కుండబద్దలు కొట్టారు. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ స్నేహ హస్తం చాచినా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది. మహారాష్ట్రలో ఎన్‌సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్)తో కలిసి ఇండియా కూటమి కలిసికట్టుగా పోటీ చేసినా చావు దెబ్బ తప్పలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏకు బలమైన ప్రత్యర్థిగా కనిపించిన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి, రాహుల్ గాంధీ నాయకత్వ లేమితో ఉనికిని కోల్పోయే స్థితికి చేరింది. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ మెరుగైన పనితీరుతో ఇండియా కూటమి గట్టెక్కింది. ఈ రాష్ట్రంలోనూ ఓట్ షేర్ పరంగా బీజేపీనే మొదటి స్థానంలో ఉన్నా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా గెలుచుకోలేకపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్న క్రమంలోనే జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ ఇండియా కూటమి పరిస్థితిని తేటతెల్లం చేసింది. మనలో మనమే కొట్టుకొని అందరికి సమష్టి ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని గెలిపిస్తున్నామని.. మున్ముందు ఇలాగే కొట్టుకొని ప్రత్యర్థుల గెలుపుకు బాటలు వేద్దామని ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీపీఐ సైతం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై ఇదే అభిప్రాయాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతోంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది కలిపి ఆరు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బిహార్, అసోం అసెంబ్లీలకు ఈ ఏడాది అక్టోబర్‌లో, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌తో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నేరుగా తలపడుతుంది కాబట్టి ఇక్కడ పొత్తులకు ఆస్కారం లేదు. తమిళనాడులో పొత్తుల విషయంలో స్టాలిన్ ఉదారంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ప్రాతినిథ్యం లభిస్తోంది. వెస్ట్ బెంగాల్ లో పొత్తులకు ఆస్కారం లేనేలేదని దీదీ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఇక మిగిలింది బిహార్ రాష్ట్రం.. ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన పోటీదారు కాదు. తేజస్వీ సూర్య నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ బీజేపీ, జేడీయూ కూటమిని ఢీకొట్టబోతోంది. లాలూ, తేజస్వీ ప్రభ చాటున కాంగ్రెస్ తన ఉనికిని వెతుక్కోవాల్సిన పరిస్థితి. తమిళనాడు, జమ్మూకశ్మీర్‌లో మాదిరిగా బిహార్‌లోనూ కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు ప్లేయర్‌గానే ఉంది. రాబోయే ఏడాది కాలంలో ఆరు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్క కేరళ మినహా ఇంకే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతగా లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ప్రభుత్వ పెద్దల తీరుతో ఆ పార్టీపై ప్రజాగ్రహం రోజురోజుకు పెరుగుతోంది. దీనిని పసిగట్టినా కట్టడి చేయలేని అశక్తుడిగా రాహుల్ గాంధీ మిగిలిపోయాడనే అపప్రద మూటగట్టుకుంటున్నారు. ఇందిరాగాంధీలా కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రాహుల్ గాంధీ బలమైన లీడర్‌గా తయారు కాడని సొంత పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారు.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 343 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. ఎన్‌డీఏ 343 సీట్లు సాధిస్తే ఇండియా కూటమి 188 స్థానాలకు పరిమితమవుతుందని, ఇతరులకు 12 సీట్లు దక్కుతాయని ఈ సర్వేలో తేలింది. బీజేపీ సొంతంగానే మేజిక్ మార్క్ దాటేసి 282 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. అంటే సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే బీజేపీకి అదనంగా 37 ఎంపీ స్థానాలు వస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 28 సీట్లు కోల్పోయి 78 స్థానాలకు పరిమితమవుతుంది. ఇతరులు 9 సీట్లు కోల్పోయి 184 స్థానాలు దక్కించుకుంటారని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి దీటైన ప్రత్యర్థిగా కనిపించిన రాహుల్ గాంధీ స్వీయ తప్పిదాలతో తన ప్రభ కోల్పోతున్నారు. మోదీ మరింత శక్తిమంతుడిగా ఎమర్జ్ అవుతుండగా.. రాహుల్ గాంధీ తన తప్పిదాలతో బీజేపీ అనుకోని అవకాశాలను చేతికందేలా చేస్తున్నారు. దేశంలో లౌకిక ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ, రాజ్యాంగ రక్షణే తన ప్రధాన లక్ష్యమని రాహుల్ గాంధీ మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చూపించాలి. అవసరమైన కాంగ్రెస్ పార్టీ పరంగా త్యాగాలు చేసి ఆయా రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ శక్తులకు దన్నుగా నిలవాలి. అప్పుడే కేంద్రంలో ప్రభుత్వ మార్పు సాధ్యమవుతుంది. ఈ సత్యం రాహుల్ కు బోధ పడడానికి ఇంకెంత సమయం పడుతుందో.. అప్పటి వరకు దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో!?