గ్రాండ్ స్టేట్‌మెంట్లే తప్ప గ్రౌండింగ్ లేని స్కీంలు
ఒక్క కొత్త పథకమూ ప్రారంభించని రేవంత్ ప్రభుత్వం
రేవంత్ సర్కార్ ఏ పని మొదలుపెట్టినా ఘనంగా ప్రారంభించడం.. అసంపూర్ణంగా వదిలిపెట్టడమనేది పధ్నాలుగు నెలలుగా చూస్తున్నాం. రైతు భరోసా, రుణమాఫీ, ఫ్రీ కరెంట్, గ్యాస్ సబ్సిడీ, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిర్మ ఆత్మీయ భరోసా, తాజాగా కులగణన ఏది చూసినా వీటిలో ఏ ఒక్కటైనా సంపూర్ణంగా పూర్తిచేసిందా? అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వస్తుంది. అయితే ప్రారంభించిన పథకాలపై ప్రచారం ఘనం.. అమలు శూన్యం అని విపక్షాలు విమర్శిస్తే మా పనితీరు బాగుండి ప్రజల్లో మాకు మంచి పేరు వస్తుంటే తట్టుకోలేకపోతున్నాయని ఎదురుదాడి చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. తీరా ప్రజల్లో నుంచి నిరసన వస్తే మంత్రులు మెల్లగా మాట మార్చడమూ మనం చూస్తున్నదే. రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డుల లింక్‌లు, సాంకేతిక సమస్యల పేరుతో వాటిని వాయిదా వేయడం కనిపిస్తున్నదే.
స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి ప్రత్యేక పాలనాధికారులు బాధ్యతలు చేపట్టి చాలాకాలమైంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కామారెడ్డి డిక్లేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఆమోదంతో ముడిపెట్టి తప్పించుకున్నది. కులగణన నివేదికలో బీసీలకు అన్యాయం జరిగిందంటే దానికి సమాధానం ఉండదు. సర్వేలో పాల్గొనవాళ్లకు మరోసారి అవకాశం కల్పిస్తామంటున్నారు. అసలు సర్వే మొదలై నాటి నుంచి ఏం రోజు ఏం జరుగుతున్నదన్నది ప్రభుత్వ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే జరుగుతున్న సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఝార్ఖండ్ ఎన్నికల అధికారిగా వెళ్లారు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా సర్వే పర్యవేక్షణను హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్‌కు అప్పగించారు. అయినా సర్వే అసంపూర్తిగానే ముగిసింది. దీన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదని సీఎం బెదిరింపులు చూశాం. ప్రభుత్వం సర్వేలో పొందుపరిచిన 75 ప్రశ్నలపై సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లను ప్రజలు నిలదీశారు. అవన్నీ పత్రికల్లో, మీడియాలో వచ్చాయి. మరి ప్రభుత్వం తరుఫున వారికి సమాధానం ఎందుకు చెప్పలేదు. సర్వేకు సంక్షేమ పథకాలకు సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న తలెత్తుతున్నది.
ఇక రేషన్‌కార్డుల ధరఖాస్తు కోసం, ఆధార్ లో అప్ డేట్ కోసం మీ సేవా కేంద్రాలు, పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులు, గ్రామసభల్లో ఇచ్చిన అప్లికేషన్లు, గతంలో మీ సేవా కేంద్రాల్లో చేసుకున్నవి ఏమై పోయాయి. రెడ్డొచ్చె మొదలయాయె అన్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ పనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు మళ్లీ మొదటికే వస్తున్న పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వదు. రుణమాఫీ అందరికీ చేయదు. రైతు భరోసా నిధులు ఒక్కసారిగా విడుదల చేయదు. కానీ నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ లేదా ఏదో వివాదాన్ని ముందుపెట్టి అమలు చేయాల్సి అంశాలన్నీ పధ్నాలుగు నెలలుగా వాయిదాలు వేస్తున్నది. వాయిదానే కాంగ్రెస్ పార్టీ విధానం అన్నట్టు పాలన సాగిస్తున్నది. మార్పు కోసం ఓట్లేసిన జనాలు రోడ్ల మీద.. వాళ్ల మద్దతు గెలిచిన వాళ్లు గాలిమోటార్లలో తిరుగుతున్నారు. అందుకే ఎవని పాలైందిరో తెలంగాణ అనే పాట మరోసారి తెలంగాణ ప్రాంతమంతా వినిపిస్తున్నది.