పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టును రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నరు : మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Advertisement
Update:2024-12-27 17:41 IST

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధన కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు - రంగారెడ్డి నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించామని, ట్రయల్‌ రన్‌ కూడా పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ కృష్ణా ట్రిబ్యునల్‌ కు తప్పుడు ఫిర్యాదు చేసిందని.. కేంద్రం పాలమూరు డీపీఆర్‌ ను వెనక్కి పంపిందని తెలిపారు. నాగార్జున సాగర్‌ కు ఎగువన 45 టీఎంసీల నికర జలాలు తెలంగాణ వాడుకోవాలని ట్రిబ్యునల్‌ తీర్పు ఉందని, అందుకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలకు 90 టీఎంసీలను కేటాయించిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకొని జిల్లాకు ఏమీ చేయలేదని.. ఇప్పుడు ఏపీ సీఎంగా పాలమూరును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

2014 ఎన్నికల ప్రచారంలో పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తానని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు జాతీయ హోదా సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుపై పెత్తనం చేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని, ఆ ప్రాజెక్టులోని వాడుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎప్పుడు పూర్తి అవుతుందో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పాలమూరుకు అనుమతులు ఇవ్వాలని ఆ జిల్లా బిడ్డగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీని అడగాలన్నారు. అవసరమైతే కేబినెట్‌ మొత్తాన్ని తీసుకెళ్లి ప్రధానిని కలువాలని సూచించారు. ఈ ప్రాజెక్టును విస్మరిస్తే రైతులు ప్రభుత్వాన్ని క్షమించబోరని హెచ్చరించారు. ఎవరి ప్రభుత్వంలో తమకు మేలు జరిగిందో ప్రజలకు తెలుసు అన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నేతలతో కలిసి కార్యాచరణ చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా కక్షసాధింపు చర్యలు బంద్‌ చేసి పరిపాలనపై దృష్టి పెట్టాలన్నారు.

Tags:    
Advertisement

Similar News