వన్డే క్రికెట్లో స్పిన్ జాదూల కథ ముగిసినట్లేనా?
2023- ఆసియాకప్ టోర్నీలో పాల్గొనే 17 మంది సభ్యుల భారతజట్టులో లెగ్ స్పిన్ జాదూ యజువేంద్ర చహాల్ కు చోటు దక్కకపోడంతో వన్డే ఫార్మాట్లో అతని కథ ముగిసేనట్లేనని భావిస్తున్నారు.
2023- ఆసియాకప్ టోర్నీలో పాల్గొనే 17 మంది సభ్యుల భారతజట్టులో లెగ్ స్పిన్ జాదూ యజువేంద్ర చహాల్ కు చోటు దక్కకపోడంతో వన్డే ఫార్మాట్లో అతని కథ ముగిసేనట్లేనని భావిస్తున్నారు.....
ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాకంగా ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న 2023 ఆసియాకప్ టోర్నీకి బీసీసీఐ ఎంపిక చేసిన 17 మంది సభ్యులజట్టులో యజువేంద్ర చహాల్ కు చోటు దక్కక పోడంతో ఈ లెగ్ స్పిన్ మాంత్రికుడి కథ ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐపీఎల్ తో పాటు భారతజట్టు సభ్యుడిగా కూడా గత కొద్దిసంవత్సరాలుగా అత్యంతప్రభావశీలక బౌలర్ గా పేరుపొందిన చహాల్ కు ఆసియాకప్ జట్టులో చోటు లేకపోడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
స్పిన్ ఆల్ రౌండర్లతో చోటు దక్కని చహాల్...
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించిన భారతజట్టులో మేటి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్ లకు చోటు లేకపోడం పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ తమతమ వివరణలను మీడియాతో పంచుకొన్నారు.
50 ఓవర్ల వన్డే క్రికెట్లో ఒక్కో బౌలర్ కు తమ కోటాగా కేవలం 10 ఓవర్లు మాత్రమే వేసే అవకాశం ఉండడంతో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్ ఆల్ రౌండర్ల వైపు మొగ్గుచూపినట్లు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వివరణ ఇచ్చారు.
జట్టును ఎంపిక చేసే సమయంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ పేరు సైతం చర్చకు వచ్చిందని, ప్రస్తుత ఆసియాకప్ కు ఎంపిక చేసిన జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను మాత్రమే ఎంపిక చేశామని తేల్చి చెప్పారు.
ద్వారాలు మూసివేయలేదు-రోహిత్...
ఆసియాకప్ జట్టులో చోటు దక్కని ఆటగాళ్లకు తాము ద్వారాలు మూసివేయలేదని, అందరి అవకాశాలు సజీవంగానే ఉంటాయని, ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు చహాల్ ఎంపికయ్యే అవకాశం లేకపోలేదంటూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
భారతజట్టులో రెండోడౌన్ స్థానం పైన జరుగుతున్న చర్చ తమకు ప్రధానంకాదని, బ్యాటింగ్ ఆర్డర్లో అదే స్థానం మాత్రమేనని రోహిత్ చెప్పాడు. స్పెషలిస్ట్ స్థానాలలో..స్పెషలిస్ట్ బ్యాటర్లు మాత్రమే ఆడతారని స్పష్టం చేశాడు.
ఓపెనర్ గా శుభ మన్ గిల్, వన్ డౌన్ లో విరాట్ కొహ్లీ, ఆరవ డౌన్ లో హార్థిక్ పాండ్యా, 7వ డౌన్ లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు దిగుతారని, కేవలం రెండు, మూడు డౌన్ స్థానాలలో మాత్రమే ఆటగాళ్లను మార్చే వెసలుబాటు తమకు ఉంటుందని తెలిపాడు. యువబ్యాటర్లకు రెండు, మూడో డౌన్ స్థానాలు సవాలేనని చెప్పాడు.
ఆసియాకప్ లో కనబరచిన ప్రతిభ ఆధారంగానే ప్రపంచకప్ లో పాల్గొనే జట్టులో చోటు సంపాదించే అవకాశాలు ఉంటాయని గుర్తు చేశాడు.
అయితే..ఆసియాకప్ జట్టుకే ఎంపిక చేయని చహాల్ ను ప్రపంచకప్ జట్టుకు ఏవిధంగా ఎంపిక చేస్తారంటూ క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
సెప్టెంబర్ 4న ప్రపంచకప్ కు జట్టు ఎంపిక..
భారత్ వేదికగా అక్టోబర్లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టును సెప్టెంబర్ 5న బీసీసీఐ ఎంపిక సంఘం ఖరారు చేయనుంది. ఆసియాకప్ లీగ్ దశలో భారత్ తన రెండోమ్యాచ్ ను సెప్టెంబర్ 4న ఆడిన మరుసటిరోజే 15 మంది సభ్యుల ప్రపంచకప్ జట్టును ప్రకటించనున్నారు.
హార్థిక్ పాండ్యాకే వైస్ కెప్టెన్సీ...
ఐర్లాండ్ తో సిరీస్ ద్వారా రీఎంట్రీ చేసిన యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రాకు బదులుగా భారతజట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకే అప్పజెప్పారు.
మరోవైపు..ఆసియాకప్ జట్టులో సంజు శాంసన్ కు అవకాశమే లేదంటూ క్రికెట్ పండితులంతా ఊదరగొట్టిన నేపథ్యంలో 17 మంది సభ్యులజట్టులో బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ గా చోటు కల్పించడం ద్వారా సెలెక్టర్లు సంచలనం సృష్టించారు.
ఆసియాకప్ లో తన ప్రారంభమ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ సెప్టెంబర్ 2న ఆడనుంది. సెప్టెంబర్ 4న క్యాండీ వేదికగా నేపాల్ తో రెండో రౌండ్ మ్యాచ్ ఆడనుంది.
సెప్టెంబర్ 6 నుంచి 15 వరకూ సూపర్-4 రౌండ్ మ్యాచ్ లు, సెప్టెంబర్ 16న ఫైనల్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఆసియాకప్ టోర్నీలో మొత్తం 8 జట్లు లీగ్ దశ నుంచి నాకౌట్ ఫైనల్స్ వరకూ 13 మ్యాచ్ లు ఆడనున్నాయి.