కడుపు నింపుకోడానికి పానీపూరీలు అమ్మాడు..ఇప్పుడు క్రికెట్లో దంచికొడుతున్నాడు!

బాల్యంలో కూడుగూడు కోసం విలవిలలాడిన గల్లీబాయ్ యశస్వీ జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో రికారుల మోత మోగిస్తున్నాడు.

Advertisement
Update:2024-02-04 09:05 IST

బాల్యంలో కూడుగూడు కోసం విలవిలలాడిన గల్లీబాయ్ యశస్వీ జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో రికారుల మోత మోగిస్తున్నాడు. 22 సంవత్సరాల వయసులోనే టెస్టు ద్విశతకం బాదడం ద్వారా వారేవ్వా! అనిపించుకొన్నాడు.

క్రికెట్ పిచ్చితో ముంబై మహానగరానికి వచ్చి...తినడానికి తిండి, తలదాచుకోడానికి గూడు లేక అల్లాడిన యశస్వీ జైశ్వాల్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. కేవలం 22 సంవత్సరాల వయసుకే సాంప్రదాయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం సెంచరీ, తొలి డబుల్ సెంచరీలతో పాటు...23 వ పుట్టినరోజు రాక ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై శతకాలు బాదిన భారత మూడో క్రికెటర్ గా నిలిచాడు.

భారతమూడో బ్యాటర్ యశస్వి...

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్టు లీగ్ సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా జరుగుతున్న రెండోటెస్టు తొలిరోజు ఆటలో భారీశతకం బాదిన యశస్వీ రెండోరోజు ఆటలో డబుల్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్నవయసులో ద్విశతకం బాదిన భారత మూడో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

తన కెరియర్ లో కేవలం 6వ టెస్టు మాత్రమే ఆడుతున్న యశస్వీ మొత్తం 290 బంతులు ఎదుర్కొని 209 పరుగులు సాధించాడు. 112 ఓవర్లలో భారత్ సాధించిన మొత్తం 396 పరుగుల స్కోరులో యశస్వీ సాధించినవే 209 పరుగులున్నాయి. 19 ఫోర్లు, 7 సిక్సర్లతో యశస్వీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ, డబుల్ సెంచరీ మార్క్ ను సిక్సర్ షాట్లతోనే యశస్వీ పూర్తి చేయడం మరో విశేషం.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 1993 సిరీస్ లో వినోద్ కాంబ్లీ 21 సంవత్సరాల 335 రోజుల వయసులో ద్విశతకం బాదిన భారత టెస్టు బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే ప్రత్యర్థిగా 21 సంవత్సరాల 355 రోజుల వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన కాంబ్లీ పేరుతోనే ఇప్పటికీ భారత రికార్డు ఉంది. కాంబ్లీ తరువాతి స్థానంలో యశస్వీ జైశ్వాల్ కొనసాగుతున్నాడు.


అరంగేట్రం టెస్టులోనే యశస్వీ సెంచరీ రికార్డు...

గతేడాది కరీబియన్ గడ్డపై టెస్టు అరంగేట్రం చేసిన యశస్వీ కేవలం 21 సంవత్సరాల వయసులోనే తన తొలి టెస్టు శతకం సాధించగలిగాడు. డోమనికాలోని విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో యశస్వీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి మొదటి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 143 పరుగుల స్కోరుతో టెస్టు క్రికెట్లో తన తొలి మూడంకెల స్కోరు నమోదు చేయగలిగాడు.

భారత మూడో ఓపెనర్ యశస్వి....

భారత టెస్టు చరిత్రలో.. అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన మూడో భారత ఓపెనర్ గా యశస్వి రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ కు..ప్రధానంగా స్ట్ర్రోక్ ప్లేయర్లకు ఏమాత్రం అనువుకాని డోమనికా పిచ్ పైన భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ మొదటి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డు నెలకొల్పారు.

1982 ఇంగ్లండ్ పర్యటనలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన నాటి ముంబై జోడీ సునీల్ గవాస్కర్- సురు నాయక్ ల తర్వాత..41 సంవత్సరాలకు మరోసారి రోహిత్- యశస్విల రూపంలో మరో ముంబై ఓపెనింగ్ జోడీ భారత ఇన్నింగ్స్ ప్రారంభించడం విశేషం.

2001 సిరీస్ లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా సంజయ్ బంగర్- వీరేంద్ర సెహ్వాగ్ జోడీ మొదటి వికెట్ కు సాధించిన 201 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని 22 సంవత్సరాల విరామం తర్వాత రోహిత్- యశస్వి జోడీ 229 పరుగుల భాగస్వామ్యంతో అధిగమించగలిగారు.

2013 సిరీస్ లో ఆస్ట్ర్రేలియాపై శిఖర్ ధావన్, 2018 సిరీస్ లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా పృథ్వీ షా తమ అరంగేట్రం టెస్టుల్లోనే శతకాలు సాధించగా..ప్రస్తుత 2023 సిరీస్ తొలిటెస్టులోనే యశస్వి జైశ్వాల్ సైతం అజేయశతకం బాదడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత మూడో ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.

21 ఏళ్ళ 197 రోజుల వయసులో...

అత్యంత పిన్నవయసులో..టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన నాలుగో అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డు నెలకొల్పాడు.

2013లో ఆస్ట్ర్రేలియాపైన శిఖర్ ధావన్ 187 పరుగులు, 2018లో వెస్టిండీస్ పై పృథ్వీ షా 134 పరుగులు సాధించారు. అయితే..యశస్వి జైశ్వాల్ మాత్రం 350 బంతులు ఎదుర్కొని 14 బౌండ్రీలతో 143 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.

భారత 17వ క్రికెటర్ యశస్వి...

టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ బాదిన భారత 17వ క్రికెటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డుల్లో చేరాడు. యశస్వి కంటే ముందుగా అరంగేట్రం శతకాలు నమోదు చేసిన భారత ప్రముఖ బ్యాటర్లలో లాలా అమర్‌నాథ్‌, గుండప్ప విశ్వనాథ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధవన్‌, రోహిత్‌ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. 2021 సిరీస్ లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ పై శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం శతకం సాధించిన తర్వాత..అదే ఘనతను యశస్వి జైశ్వాల్ మాత్రమే దక్కించుకోగలిగాడు.

గత 14 ఏళ్లలో భారత తొలి బ్యాటర్...

విదేశీగడ్డపై టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే శతకం బాదిన భారత 7వ బ్యాటర్ గా, గత 14 సంవత్సరాలలో భారత తొలి క్రికెటర్ గా యశస్వి నిలిచాడు. 2010 సిరీస్ లో శ్రీలంక గడ్డపై సురేశ్ రైనా అరంగేట్రం టెస్టు శతకం నమోదు చేసిన తర్వాత..కరీబియన్ గడ్డపై యశస్వి అదే రికార్డును అందుకోగలిగాడు.

ముంబై ఫుట్ పాత్ ల పైన పడుకొని, పానీపూరీలు అమ్మటం ద్వారా కడుపు నింపుకొన్న యశస్వీ జైశ్వాల్..21 సంవత్సరాల వయసుకే అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగటం, టెస్టు క్రికెట్ అరంగేట్రంలోనే భారీశతకం బాదటం..22 ఏళ్ళ వయసుకే టెస్టు తొలి ద్విశతకం బాదడం భారత క్రికెట్ విజయగాధల్లో ఒకటిగా మిగిలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News