ప్రపంచకప్ లో రోహిత్ అదేజోరు..అదే హోరు!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల జోరు, రికార్డుల హోరు కొనసాగుతోంది. కరీబియన్ గ్రేట్ బ్రయన్ లారా రికార్డును సైతం అధిగమించాడు.

Advertisement
Update:2023-10-20 10:55 IST

ప్రపంచకప్ లో రోహిత్ అదేజోరు..అదే హోరు!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల జోరు, రికార్డుల హోరు కొనసాగుతోంది. కరీబియన్ గ్రేట్ బ్రయన్ లారా రికార్డును సైతం అధిగమించాడు.

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో మాజీ చాంపియన్ భారత్ ను కెప్టెన్ రోహిత్ శర్మ విజయపథంలో నడిపిస్తున్నాడు. జట్టుకు ముందు నిలబడి పరుగుల మోత, రికార్డుల హోరుతో విజయం వెంట విజయం అందిస్తున్నాడు.

పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన 4వ రౌండ్ పోరులో సైతం రోహిత్ చెలరేగిపోయాడు. యువఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి పరుగుల వేట మొదలు పెట్టిన రోహిత్..బంగ్లా బౌలర్లను ఓ పట్టు పట్టాడు.

కేవలం 40 బంతుల్లోనే 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 48 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ పలు అరుదైన రికార్డులు సాధించాడు.

4 మ్యాచ్ ల్లో 265 పరుగులు..

ప్రస్తుత ప్రపంచకప్ మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో రోహిత్ ఓ డకౌట్ తో సహా మొత్తం 265 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అఫ్ఘనిస్థాన్ పై శతకం, పాకిస్థాన్ పై 85 పరుగుల స్కోరుతో నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు.

బంగ్లాదేశ్ పై 48 పరుగులు సాధించడం ద్వారా ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. ఇప్పటి వరకూ కరీబియన్ దిగ్గజం బ్రయన్ లారా పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. వన్డే క్రికెట్లో 54వ హాఫ్ సెంచరీ రికార్డు చేజార్చుకొన్న రోహిత్ ప్రపంచకప్ చరిత్రలో నాలుగో అత్యుత్తమ బ్యాటర్ గా నిలిచాడు.

మాస్టర్ సచిన్ 2278 పరుగులతో అగ్రస్థానంలో ఉంటే..1743 పరుగులతో రికీ పాంటింగ్ రెండు, 1531 పరుగులతో కుమార సంగక్కర మూడు స్థానాలలో ఉంటే రోహిత్ 7 శతకాలతో సహా అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్ గా, తొలి ఓపెనర్ గా నిలిచాడు.

ప్రపంచకప్ చేజింగ్ లో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు, అత్యధిక ఫోర్లు సాధించిన మొనగాడిగా రోహిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

మొదటి 10 ఓవర్లలోనే 32 సిక్సర్లు...

సిక్సర్ల బాదుడులో రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా నిలిచాడు. మొదటి 10 ఓవర్లలో 486 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 32 సిక్సర్లు బాదాడు. ఆస్ట్ర్రేలియా ( 30 ), దక్షిణాఫ్రికా ( 19 ), శ్రీలంక (14), ఇంగ్లండ్ (13) జట్లు సాధించిన సిక్సర్ల కంటే రోహిత్ శర్మ ఒక్కడే బాదిన సిక్సర్లు ఎక్కువ కావడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

ముగ్గురి గ్రేట్ల సరసన రోహిత్...

ఆసియాగడ్డపై 6వేల పరుగులు సాధించిన భారత నాలుగో క్రికెటర్ గా రోహిత్ శర్మ అవతరించాడు. మాజీ కెప్టెన్లు మహ్మద్ అజరుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ల సరసన రోహిత్ చోటు సంపాదించాడు.

ఆసియాగడ్డపై అత్యధికంగా 12వేల 067 పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు మాస్టర్ సచిన్ పేరుతో ఉంది. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కొహ్లీ 7800 పరుగులతో కొనసాగుతున్నాడు.

బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగుల రోహిత్..

ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. గత రెండు ప్రపంచకప్ టోర్నీలలోనూ బంగ్లాపై సెంచరీల మోత మోగించిన రోహిత్..ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం 48 పరుగుల స్కోరుకే వెనుదిరిగాడు.

2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాపై 126 బంతుల్లో 137 పరుగులు సాధించిన రోహిత్..2019 ప్రపంచకప్ లో 92 బంతుల్లోనే 104 పరుగుల స్కోరుతో నిలిచాడు.

బంగ్లా ప్రత్యర్థిగా వన్డేలలో రోహిత్ కు 3 శతకాలున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ తో సహా బంగ్లాపైన 17 వన్డేలు ఆడిన రోహిత్ 816 పరుగులతో 56.77 సగటు నమోదు చేశాడు.

అత్యధిక ప్రపంచకప్ శతకాల మొనగాడు...

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 7 శతకాలు సాధించడం ద్వారా రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2015 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ ఐదు శతకాలు బాదడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

రోహిత్ తర్వాత మాస్టర్ సచిన్ 6, సౌరవ్ గంగూలీ 4, శిఖర్ ధావన్ 3, విరాట్ కొహ్లీ 3 సెంచరీలతో ఉన్నారు. కెన్యా ప్రత్యర్థిగా సచిన్ రెండు శతకాలు సాధిస్తే..

సౌరవ్ గంగూలీ సైతం కెన్యాపైనే 2 శతకాలు బాదితే బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా రోహిత్, విరాట్ చెరో రెండు ప్రపంచకప్ సెంచరీలు నమోదు చేశారు.

ప్రపంచకప్ లో 1200 పరుగుల హిట్ మ్యాన్!

తన కెరియర్ లో మూడో ప్రపంచకప్ ఆడుతున్న రోహిత్ బంగ్లాపైన 48 పరుగుల స్కోరు సాధించడం ద్వారా 1243 పరుగులతో ఏబీ డివిలియర్స్, బ్రయన్ లారాలను అధిగమించాడు.

సఫారీ సూపర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ 23 మ్యాచ్ ల్లో 1207 పరుగులు, బ్రయన్ లారా 34 మ్యాచ్ ల్లో 1225 పరుగులు సాధిస్తే..రోహిత్ మాత్రం కేవలం 17 మ్యాచ్ ల్లోనే 1200 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.

Tags:    
Advertisement

Similar News