సరుకు, కరుకు లేని మహిళా ఐపీఎల్!

అదానీ, అంబానీ భాగస్వాములుగా బీసీసీఐ అట్టహాసంగా నిర్వహించిన మహిళా ఐపీఎల్ తొలి సీజన్ పోటీలు నిస్తేజంగా ముగిశాయి. అన్ని విభాగాలలోనూ భారత దిగ్గజ మహిళా క్రికెటర్లు వెలవెలపోయారు.

Advertisement
Update:2023-03-28 13:34 IST

అదానీ, అంబానీ భాగస్వాములుగా బీసీసీఐ అట్టహాసంగా నిర్వహించిన మహిళా ఐపీఎల్ తొలి సీజన్ పోటీలు నిస్తేజంగా ముగిశాయి. అన్ని విభాగాలలోనూ భారత దిగ్గజ మహిళా క్రికెటర్లు వెలవెలపోయారు.....

20 ఓవర్లు..60 థ్రిల్స్ గా సాగే ఐపీఎల్ అంటేనే వినోదం. క్రికెట్ కంటే సంచలనం, ఉత్కంఠ ఎక్కువగా ఉండే ఐపీఎల్ ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్న బీసీసీఐ..మహిళా క్రికెట్ తోనూ లాభసాటి వ్యాపారం చేయాలన్న ఆలోచన బెడిసికొట్టేలా కనిపిస్తోంది.

బిజినెస్ మాగ్నెట్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, విజయ్ మాల్యా లాంటి బడాబాబులకు చెందిన సంస్థల భాగస్వామ్యంతో మహిళా ఐపీఎల్ ను నిర్వహించిన బీసీసీఐకి..తొలిసీజన్ లీగ్ తీవ్రనిరాశనే మిగిల్చింది. ఆశించిన స్థాయిలో పోటీలు సాగకపోడం, ఆదరణ లభించకపోడం, ప్రధానంగా భారత ప్లేయర్లు దారుణంగా విఫలం కావడం నిర్వాహక సంఘం, స్పాన్సర్ల ఉత్సాహం పై నీళ్లు చల్లింది.

కురచ బౌండ్రీలైన్లతో టోర్నీ.....

ముంబైలోని రెండు స్టేడియాలు (డీవై పాటిల్ స్టేడియం), ( బ్రబోర్న్ స్టేడియం) వేదికలుగా..ఐదుజట్లతో మూడువారాలపాటు నిర్వహించిన ఈ ప్రారంభ మహిళా ఐపీఎల్ లీగ్ విజేతగా హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది.

స్టేడియాలలో ఉచిత ప్రవేశం కల్పించినా...ప్రత్యక్షప్రసారాలను ఉచితంగా చూడవచ్చంటూ అంబానీలు నానాహడావిడి చేసినా అభిమానులను ఆ కట్టుకోలేకపోయారు.

మహిళా ఐపీఎల్ ను అభిమానులకు చేరువ చేయటం కోసం, వినోదప్రధానంగా సాగేలా చేయటమే లక్ష్యంగా నిర్వాహక సంఘం నిబంధనలను తుంగలోకి తొక్కింది.

ఒక్కో ఫ్రాంచైజీ తన తుదిజట్టులోకి ఐదుగురు చొప్పున విదేశీ ప్లేయర్లను తీసుకొనేలా ప్రత్యేక నిబంధన ప్రవేశపెట్టింది. అంతటితో ఆగి పోకుండా బౌండ్రీ లైన్ నిడివిని సైతం ఇష్టం వచ్చినట్లుగా తగ్గించింది.

పురుషుల క్రికెట్లో బౌండ్రీలైన్ 65 నుంచి 80 మీటర్ల వరకూ ఉంటుంది. మహిళా క్రికెట్లో మాత్రం 50 నుంచి 55 మీటర్లకే పరిమితం చేస్తూ వస్తున్నారు. అయితే..200కు పైగా స్కోర్లు నమోదు కావటానికి వీలుగా..బౌండ్రీలైన్ నిడివిని 55 నుంచి 45 మీటర్లకు కుదించారంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది.

ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ సమరం కోసం..అతిచిన్న బౌండ్రీలైన్లను ఉంచడం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ను అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే..ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం..బౌండ్రీలైన్ ఎంత ఉండాలో నిర్ణయించేది నిర్వాహక సంఘం మాత్రమేనని, తమ చేతుల్లో ఏదీ లేదని తేల్చి చెప్పింది.

ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, హాకీ..ఇలా ఏ క్రీడను తీసుకొన్నా నిబంధనలు, మైదానాల కొలతలు ఒకేతీరుగా ఉంటాయి. క్రికెట్లో మాత్రమే పురుషులకు, మహిళలకు వేర్వేరు నిబంధనలు ఉంచడం చర్చనీయాంశంగా మారింది.

విదేశీ క్రికెటర్లు హిట్..భారత క్రికెటర్ల ఫ్లాప్

ఇక..ప్రారంభమహిళా ఐపీఎల్ లో అత్యధికంగా 3 కోట్ల 40 లక్షల రూపాయల వేలం ధర పలికిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ స్మృతి మందన దారుణంగా విఫలమయ్యింది. మొత్తం ఎనిమిది మ్యాచ్ ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేకపోయింది.

అంతేకాదు..బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్...ఏ విభాగం లో చూసినా భారత ప్లేయర్ల ప్రతిభ నామమాత్రమే. బ్యాటింగ్ మొదటి ఐదు అత్యుత్తమ ప్లేయర్ల జాబితాలో చోటు సంపాదించడం ద్వారా ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భారత పరువు దక్కించింది.

అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించిన టాప్ -5 ప్లేయర్లంతా విదేశీ క్రికెటర్లే కావడం విశేషం.

బ్యాటింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా ఉన్న ఆస్ట్ర్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్ 345 పరుగులతో నంబర్ వన్ గా నిలిచింది. రెండోస్థానంలో స్కీవర్ బ్రంట్, మూడోస్థానంలో తహీలా మెక్ గ్రాంత్ ఉంటే..హర్మన్ ప్రీత్ కౌర్ 281 పరుగులతో నాలుగోస్థానంలో నిలిచింది.

బౌలింగ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్, ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఇకెల్ స్టిన్ చెరో 16 వికెట్లు చొప్పున పడగొట్టి సంయుక్త అగ్రస్థానంలో నిలిచారు.

ఇంగ్లండ్ కు చెందిన ఇస్సీ వాంగ్, న్యూజిలాండ్ బౌలర్ అమీలియా కెర్ , సైకా ఇషాక్ తలో 15 వికెట్లు పడగొట్టి చివరి మూడుస్థానాలలో నిలిచారు.

అత్యధిక అర్థశతకాలు, 5 వికెట్లు, అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డులన్నీ విదేశీ క్రికెటర్ల పేరుతోనే ఉన్నాయి.

అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లలో సోఫీ డివైన్ తో కలసి భారత ఓపెనర్ షెఫాలీ వర్మ ( 13 సిక్సర్లు ) సంయుక్త అగ్రస్థానాని పంచుకోగలిగింది.

పాపం! అదానీ, అంబానీ...

మహిళా ఐపీఎల్ వ్యాపారంలో గౌతం అదానీ, ముకేశ్ అంబానీలు కలసి 3వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టారు. అయితే..అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలవడం ద్వారా 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకొని ఊపిరిపీల్చుకొంది.

రన్నరప్ గా ఢిల్లీజట్టు 3 కోట్ల రూపాయలతో సరిపెట్టుకొంది. లీగ్ దశలోనే దారుణంగా విఫలమైన అదానీజట్టు గుజరాత్ జెయింట్స్ ఉత్తచేతులతో మిగిలిపోయింది.

బెంగళూరు ఫ్రాంచైజీ తన మొత్తం వేలం బడ్జెట్ లో 22 శాతం ( 3 కోట్ల 40 లక్షల రూపాయలు ) కేవలం ఒక్కప్లేయర్.. స్మృతి మందన కోసమే ఖర్చు చేస్తే..ఓపెనర్ గా, కెప్టెన్ గా దారుణంగా విఫలమయ్యింది.

మహిళా క్రికెట్లో వినోదం కొరవడటం, ఆటతీరులో సరుకు, కరుకు లేకపోడంతో.. మహిళా ఐపీఎల్ అంటేనే అభిమానులు బాబోయ్ అనుకొనే పరిస్థితి వచ్చింది. జూనియర్ సబ్ -జూనియర్ క్రికెట్ ప్రమాణాలకు దరిదాపుల్లో మహిళా ఐపీఎల్ ప్రమాణాలు లేకపోడంతో రేటింగ్ సైతం లేకుండా పోయింది.

రానున్న సీజన్లలో ప్రమాణాలు మెరుగుపడకుంటే.. ప్రధానంగా భారత క్రికెటర్లు తమ ఆటతీరును మెరుగు పరచుకోకుంటే...మహిళా ఐపీఎల్ దుకాణాన్ని బీసీసీఐ మూసివేయక తప్పదు.!

Tags:    
Advertisement

Similar News