మాస్టర్ సరసన నయా మాస్టర్!
ఆధునిక క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. వైట్ బాల్ క్రికెట్లో 16వేల పరుగుల మైలురాయిని చేరడం ద్వారా మాస్టర్ సచిన్ సరసన చోటు సంపాదించాడు.
ఆధునిక క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. వైట్ బాల్ క్రికెట్లో 16వేల పరుగుల మైలురాయిని చేరడం ద్వారా మాస్టర్ సచిన్ సరసన చోటు సంపాదించాడు...
ఆస్ట్రేలియాతో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
వన్డే, టీ-20 ఫార్మాట్లలో కలిపి ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ ల ద్వారా 16వేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే గతంలోనే ఈ రికార్డు నెలకొల్పిన మాస్టర్ సచిన్ టెండుల్కర్ సరసన విరాట్ నిలిచాడు.
ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 187 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ విజయంలో సూర్యకుమార్ యాదవ్ తో కలసి విరాట్ కీలకపాత్ర పోషించాడు.
మూడో వికెట్ కు సూర్యకుమార్ యాదవ్ తో కలసి 103 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా భారత విజయానికి మార్గం సుగమం చేశాడు. సూర్యకుమార్ 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే...విరాట్ 63 పరుగులకు అవుటయ్యాడు.
ఈ క్రమంలో విరాట్ వైట్ బాల్ క్రికెట్లో 16000 పరుగులు సాధించిన భారత రెండో క్రికెటర్ గా నిలిచాడు. వన్డేలు, టీ-20లు కలిపి మొత్తం 369 మ్యాచ్ లు ఆడిన విరాట్ 16వేల 4 పరుగుల సాధించాడు. ఇందులో 43 వన్డే శతకాలు, ఓ టీ-20 సెంచరీతో పాటు 97 అర్ధశతకాలు సైతం ఉన్నాయి. 55.95 సగటు సైతం విరాట్ నమోదు చేశాడు.
వన్డేలలో 12వేల 344 పరుగులు...
50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో విరాట్ మొత్తం 262 మ్యాచ్ లు ఆడి 43 సెంచరీలు, 64 అర్థసెంచరీలతో సహా 12వేల 344 పరుగులు సాధించాడు.
ఇక..టీ-20 ఫార్మాట్లో ఆసీస్ తో హైదరాబాద్ లో ముగిసిన ఆఖరి టీ-20 వరకూ 107 మ్యాచ్ లు ఆడిన విరాట్ 3వేల 660 పరుగులు సాధించాడు. వైట్ బాల్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఇద్దరు బ్యాటర్లలో కొహ్లీ రెండోవాడిగా నిలిచాడు.
భారతక్రికెట్ కు 22 సంవత్సరాలపాటు సేవలు అందించిన మాస్టర్ సచిన్ టెండుల్కర్ వైట్ బాల్ క్రికెట్లో మొత్తం 463 మ్యాచ్ లు ఆడి 18వేల 426 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
తన కెరియర్ లో ఒకే ఒక్క అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన సచిన్ 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రానున్న కాలంలో మాస్టర్ సచిన్ అత్యధిక పరుగుల రికార్డును నయామాస్టర్ విరాట్ కొహ్లీ అధిగమించినా ఆశ్చర్యపోనక్కరలేదు.