వంద టీ- 20 మ్యాచ్ ల స్మృతి మంద‌న‌

భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మందన ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. వంద టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత రెండో మహిళా క్రికెటర్ గా రికార్డుల్లో చేరింది.

Advertisement
Update:2022-10-12 10:45 IST

భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మందన ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. వంద టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత రెండో మహిళా క్రికెటర్ గా రికార్డుల్లో చేరింది.

ప్రపంచ మహిళా క్రికెట్లో భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మందన...క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. టెస్టులు, వన్డే మ్యాచ్ ల్లో మాత్రమే కాదు...ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లోనూ భారత స్టార్ ప్లేయర్ గా కొనసాగుతోంది.

2022 ఆసియాకప్ తో....

బంగ్లాదేశ్ లోని సిల్హౌట్ వేదికగా జరుగుతున్న 2022 ఆసియాకప్ టీ-20 టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ లో థాయ్ లాండ్ తో మ్యాచ్ ఆడటం ద్వారా స్మృతి మందన 100 మ్యాచ్ ల మైలురాయిని చేరింది. ఈ ఘనత సాధించిన భారత రెండో మహిళగా నిలిచింది.

భారత కెప్టెన్ హర్మ‌న్ ప్రీత్ కౌర్ 100 టీ-20 మ్యాచ్‌లు ఆడిన భారత తొలి మహిళా క్రికెటర్ గా నిలిచింది. మొత్తం 135 మ్యాచ్‌లు ఆడిన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌.. 27.28 స‌గ‌టుతో 2,647 ప‌రుగులు సాధించింది. అందులో ఒక శతకం, 8 అర్ధ శతకాలు ఉన్నాయి. బౌలర్ గా హర్మన్ ప్రీత్ 32 వికెట్లు పడగొట్టింది.

టీ-20ల్లో శతకం లేని స్మృతి..

ప్రస్తుత ఆసియాకప్ లో థాయ్ లాండ్ తో ముగిసిన పోటీ వరకూ ఆడిన మొత్తం వంద మ్యాచ్ ల్లో స్మృతి 26.96 స‌గ‌టుతో 2,373 ప‌రుగులు నమోదు చేసింది. అందులో 17 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోర్ 86 ప‌రుగులు మాత్రమే. టీ-20ల్లో తొలి శతకం కోసం స్మృతి ఎదురుచూస్తోంది.

ఇక...ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధికంగ న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్ 136 మ్యాచ్ లు ఆడటం ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఆ త‌ర్వాత స్థానాల్లో హ‌ర్మ‌న్ ప్రీత్ (135), ఇంగ్లండ్‌ ప్లేయర్ డానియెల్లీ హ్యూట్ (135), ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ (132), వెస్టిండీస్‌ హిట్టర్ దేవేంద్ర డాటిన్ (127) ఉన్నారు. సరికొత్తగా వంద టీ-20 మ్యాచ్ ల క్లబ్ లో స్మృతి మందన చోటు సంపాదించగలిగింది.

Tags:    
Advertisement

Similar News