అంగరంగ వైభవంగా ప్రారంభమైన 22వ కామన్వెల్త్ గేమ్స్.. పీవీ సింధు ఓకే

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష గురువారం సాయంత్రం నెగెటివ్‌గా వచ్చింది. దీంతో ముందు నిర్ణయించిన మేరకు హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, పీవీ సింధు ఫ్లాగ్ బేరర్లుగా ముందు నడిచారు.

Advertisement
Update:2022-07-29 10:10 IST

మిరుమిట్లుగొలిపే రంగురంగుల కాంతులు, డ్యాన్సులు, మ్యూజిక్‌ నడుమ బర్మింగ్‌హామ్‌లోని అలెగ్జాండర్ స్టేడియంలో 22వ కామన్వెల్త్ గేమ్స్‌ను క్వీన్ ఎలిజబెత్ తరఫున ప్రిన్స్ చార్లెస్ ప్రారంభించారు. సంగీతకారుడు అబ్రహాం ప్యాడి తన అద్భుత ప్రదర్శనతో ఈ సంబరాలను ప్రారంభించాడు. ఆ తర్వాత ఇండియన్ క్లాసికల్ సింగర్, కంపోజర్ రాంజనా ఘాతక్ తన పాటలతో ప్రేక్షకులను మైమరపింప చేసింది. బర్మింగ్‌హామ్ నగర విశేషాలతో పాటు బ్రిటన్, కామన్వెల్త్ దేశాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అనేక కార్యక్రమాలు ప్రారంభ వేడుకలో ప్రదర్శించారు.

కోవిడ్ పాండమిక్ అనంతరం అతి తక్కువ ఆంక్షలతో జరుగుతున్న మెగా ఈవెంట్ కామన్వెల్త్ గేమ్స్ కావడం గమనార్హం. క్వీన్ ఎలిజబెత్‌ పాలనలో జరిగిన ముఖ్యమైన సంఘటనలతో కూడిన ఫీచర్ ఫిల్మ్‌ను మొదటిగా ప్రదర్శించారు. ఆ తర్వాత రెడ్, వైట్, బ్లూ కలర్‌లో ఉన్న 70 కార్లు బ్రిటన్ జాతీయ జెండా మాదిరిగా స్టేడియంలోకి ప్రవేశించగా.. అందులోని ఆస్టన్ మార్టిన్ కారు నుంచి ప్రిన్స్ చార్లెస్ దిగారు. బర్మింగ్‌హామ్‌లోని ఆటోమొబైల్ ఇండస్ట్రికి నివాళిగా ఇలా కార్ల ప్రదర్శన చేశారు.

బర్మింగ్‌హామ్ సంస్కృతి, భిన్నత్వాన్ని ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు. చార్లీచాప్లిన్ పుట్టిన ఊరు కావడంతో ఆయనకు నివాళి అర్పించారు. అలాగే విలియం షేక్స్‌పియర్ 'ఫస్ట్ ఫోలియో' బర్మింగ్‌హామ్ లైబ్రరీలోనే ఉండటంతో.. ఆయనకు కూడా ఘన నివాళి అర్పించారు. ఓపెనింగ్ సెర్మనీలో భారీ ఎద్దు ఆకారం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఇది ఈసారి కామన్వెల్త్ గేమ్స్ మస్కట్ కావడం గమనార్హం. 72 దేశాలు, బర్మింగ్‌హామ్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ 92 ఏళ్ల క్రీడా చరిత్రలో చాలా ప్రత్యేకమైనవని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిసీ మార్టిన్ అన్నారు.

మెరిసిన పీవీ సింధు..

గత కామన్వెల్త్ గేమ్స్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది. దీంతో మొదటిగా పరేడ్‌లో ఆ దేశమే పాల్గొన్నది. ఆ తర్వాత మిగిలిన ఓషియానేసియా దేశాలు పరేడ్ చేశాయి. వాటి వెనుక ఆఫ్రికా, అమెరికా, ఆసియా, కరేబియన్ దేశాలు పరేడ్ చేశాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష గురువారం సాయంత్రం నెగెటివ్‌గా వచ్చింది. దీంతో ముందు నిర్ణయించిన మేరకు హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, పీవీ సింధు ఫ్లాగ్ బేరర్లుగా ముందు నడిచారు. భారత అథ్లెట్లు స్టేడియంలోకి ప్రవేశించగానే అభిమానుల కేరింతలతో మార్మోగిపోయింది. ఇక చివరిగా.. హోస్ట్ ఇంగ్లాండ్ పరేడ్ చేసింది. నోబెల్‌ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌పై ఓ డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - తమ కలలను నెరవేర్చుకునే హక్కు పిల్లలకు ఉందన్నారు.

ఆగస్టు 8 వరకు జరిగే ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా నుంచి 214 మంది అథ్లెట్లు 16 క్రీడా విభాగాల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో 72 దేశాలకు చెందిన 6500 మంది అథ్లెట్లు 20 క్రీడా విభాగాల్లో పోటీ పడనున్నారు.

Tags:    
Advertisement

Similar News