సూర్య పవర్..భారత్ సిరీస్ విన్నర్!

ప్రపంచకప్ కు సన్నాహాలను ప్రపంచ నంబర్ వన్ భారత్ సిరీస్ విజయంతో మొదలు పెట్టింది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 2-1తో కైవసం చేసుకొంది.

Advertisement
Update:2022-09-26 09:00 IST
సూర్య పవర్..భారత్ సిరీస్ విన్నర్!
  • whatsapp icon

ప్రపంచకప్ కు సన్నాహాలను ప్రపంచ నంబర్ వన్ భారత్ సిరీస్ విజయంతో మొదలు పెట్టింది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 2-1తో కైవసం చేసుకొంది. హైదరాబాద్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఆఖరిపోరులో భారత్ 6 వికెట్ల విజయం సాధించింది....

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16న ప్రారంభమయ్యే టీ-20 ప్రపంచకప్ సన్నాహాలలో భాగంగా జరిగిన తొలి సిరీస్ లో భారత్ విజేతగా నిలిచింది. ప్రపంచ టీ-20 చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకొంది.

హైదరాబాద్ లో సూర్య, విరాట్ షో....

మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా ముగిసిన తొలి టీ-20 పోరులో ఆస్ట్రేలియా 4 వికెట్లతో సంచలన విజయం సాధించడం ద్వారా సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. అయితే..వానదెబ్బతో ఎనిమిది ఓవర్లమ్యాచ్ గా ముగిసిన కీలక రెండో మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల గెలుపుతో సమఉజ్జీగా నిలిచింది.

ఇక...సిరీస్ విజేత ను నిర్ణయించే ఆఖరి, నిర్ణయాత్మక మ్యాచ్ హైదరాబాద్ వేదికగా నువ్వానేనా అన్నట్లుగా సాగింది.

హైదరాబాద్ వేదికగా మూడేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ కు 35వేలకు పైగా అభిమానులు హాజరయ్యారు. సిరీస్ విజేతగా నిలవాలంటే నెగ్గితీరాల్సిన ఈమ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలకటాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

గ్రీన్ రికార్డు హాఫ్ సెంచరీ...

ఆరో్న్ పించ్- కామెరూన్ గ్రీన్ లతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్ర్రేలియా కేవలం 3.3 ఓవర్లలోనే 44 పరుగుల మెరుపు ఆరంభాన్ని సాధించింది. అయితే...డేంజర్ మాన్ పించ్ ను భారత తురుపుముక్క అక్షర్ పటేల్ పడగొట్టాడు. వన్ డౌన్ స్టీవ్ స్మిత్, రెండోడౌన్ మాక్స్ వెల్ సైతం సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. మరోవైపు యువఓపెనర్ గ్రీన్

బౌండ్రీలు, సిక్సర్ల షాట్లతో చెలరేగిపోయాడు. భారత బౌలర్లపై విరుచుకు పడి 7 ఫోర్లు, 3 సిక్సర్లతో రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు.

భారత్ ప్రత్యర్థిగా కేవలం 21 బాల్స్ లోనే టీ-20 హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా గ్రీన్ రికార్డుల్లో చేరాడు.

దూకుడుమీదున్న గ్రీన్ 52 పరుగుల స్కోరుకు భువనేశ్వర్ బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో భారత్ ఊపిరి తీసుకోగలిగింది. మిడిలార్డర్ ఆటగాళ్లు జోస్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్ తమ బ్యాట్లకు పని చెప్పడంతో కంగారూ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగుల స్కోరు సాధించింది.

ఇంగ్లిస్ 24, టిమ్ డేవిడ్ 54, సామ్స్ 28 పరుగుల స్కోరు సాధించారు. భారత బౌలర్లలో స్పిన్నర్ అక్షర్ పటేల్ 3 వికెట్లు, చహాల్, భువీ, హర్షల్ తలో వికెట్ పడగొట్టారు.

సూర్య 360 డిగ్రీల హిట్టింగ్... మ్యాచ్ నెగ్గాలంటే 187 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్లు రాహుల్, కెప్టెన్ రోహిత్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

రాహుల్ ఒకే ఒక్క పరుగుకు అవుట్ కాగా, రోహిత్ 17 పరుగులకు వెనుదిరిగాడు. భారత్ 3.4 ఓవర్లలోనే 30 పరుగులకే ఓపెనర్ల వికెట్లు నష్టపోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్ విరాట్, యువహిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 3వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో చెలరేగిపోయారు. కంగారూ బౌలర్లకు ఫ్లడ్ లైట్ల వెలుగులోనే చుక్కలు చూపించారు. మొదటి 10 ఓవర్లు ముగిసే సమయానికే భారత్ 2 వికెట్లు మాత్రమే నష్టపోయి..విజయానికి 96 పరుగుల దూరంలో నిలిచింది.

ప్రధానంగా..గ్రౌండ్ నలుమూలలకూ తనదైన శైలిలో షాట్లు కొట్టే 360 డిగ్రీల హిట్టర్ సూర్యకుమార్ చెలరేగిపోయాడు. తనకు ఎదురేలేదన్నట్లుగా వీరవిహారం చేశాడు.36 బాల్స్ లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీతో పాటు..కొహ్లీతో కలసి 104 పరుగుల కీలక భాగ్యస్వామ్యంతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు.

69 పరుగుల స్కోరుకు సూర్య అవుటైన మరుక్షణం నుంచే ..విరాట్ గేరు మార్చాడు.ఆచితూచి ఆడుతూ అర్ధశతకం పూర్తి చేశాడు. 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 63 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు.

హార్ధిక్ పాండ్యా 25 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 6వికెట్ల విజయంతో సిరీస్ సొంతం చేసుకోగలిగింది.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అక్షర్ పటేల్...

మూడుమ్యాచ్ ల సిరీస్ లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టిన భారత లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. నిర్ణయాత్మక ఆఖరిపోరులో 69 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా భారత్ ఆడిన రెండుకు రెండు టీ-20మ్యాచ్ ల్లోనూ విజేతగా నిలవడం విశేషం.

Tags:    
Advertisement

Similar News