దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ప్రపంచకప్ రికార్డు!

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ 5వ రౌండ్ లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డీ కాక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Advertisement
Update:2023-10-25 09:42 IST

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ 5వ రౌండ్ లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డీ కాక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మూడో శతకంతో తనజట్టుకు నాలుగో విజయం అందించాడు....

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా దూకుడు కొనసాగుతోంది. 10జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో 4వ విజయం సాధించడం ద్వారా లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన ఏకపక్ష పోరులో బంగ్లాదేశ్ ను 149 పరుగులతో చిత్తు చేసింది. ఇప్పటి వరకూ లీగ్ టేబుల్ రెండోస్థానంలో ఉంటూ వచ్చిన న్యూజిలాండ్ ను అధిగమించింది.

డీ కాక్ ధూమ్ ధామ్ సెంచరీ....

హాట్ హాట్ గా సాగుతున్న ప్రస్తుత ప్రపంచకప్ 5వ రౌండ్ పోరులో ముందుగా కీలక టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 382 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 12, వన్ డౌన్ వాండెర్ డూసెన్ 1 తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ..ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ మాత్రం చెలరేగిపోయాడు.

బంగ్లాబౌలర్లను చీల్చి చెండాడు. ఐపీఎల్ లో తన హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియంలో డి కాక్ చెలరేగిపోయాడు.

రెండో డౌన్ మర్కరమ్ ( 60), మూడోడౌన్ క్లాసెన్ ( 90 ) లు అండగా నిలవడంతో కీలక భాగస్వామ్యాలతో పరుగుల మోత మోగించాడు. ప్రస్తుత ప్రపంచకప్ మొదటి 4 రౌండ్ల మ్యాచ్ ల్లోనే రెండు శతకాలు బాదడం ద్వారా సూపర్ ఫామ్ లో ఉన్న డి కాక్ బంగ్లా బౌలింగ్ ఎటాక్ ను భారీషాట్లతో చెల్లాచెదురు చేశాడు.

కేవలం 140 బంతుల్లోనే 15 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 174 పరుగుల స్కోరు సాధించాడు.

కెప్టెన్ మర్కరమ్ 69 బంతుల్లో 7 బౌండ్రీలతో 60 పరుగులు, క్లాసెన్ 49 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 90 పరుగులతో వీరవిహారం చేశారు. దీంతో దక్షిణాఫ్రికా

382 పరుగుల భారీస్కోరుతో మ్యాచ్ పై పట్టు బిగించగలిగింది.

గిల్ క్రిస్ట్ ను అధిగమించిన డి కాక్...

ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో శ్రీలంక పైన 100, ఆస్ట్ర్రేలియాపైన 109 స్కోర్లతో సెంచరీలు సాధించిన డి కాక్ ..బంగ్లాపైనా భారీశతకంతో మూడు సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.

ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్ క్రిస్ట్ పేరుతో ఉన్న 149 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును క్వింటన్ డీ కాక్ తెరమరుగు చేశాడు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్ గా క్వింటన్ డి కాక్ నిలిచాడు. 2007 ప్రపంచకప్ లో శ్రీలంకపైన ఆడం గిల్ క్రిస్ట్ సాధించిన 149 పరుగుల రికార్డు స్కోరును ఆధిగమించాడు. అంతేకాదు.. డేవిడ్ వార్నర్ పేరుతో ఉన్న ప్రపంచకప్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 163 పరుగుల రికార్డును సైతం తెరమరుగు చేయగలిగాడు.

150వ వన్డేలో 20వ శతకం..

క్వింటన్ డి కాక్ కెరియర్ లో ఇది 150వ వన్డే కాగా..20వ శతకం కావడం మరో విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో 12వేల పరుగుల మైలురాయిని చేరిన 7వ దక్షిణాఫ్రికా

బ్యాటర్ గా నిలిచాడు. మొత్తం 284 మ్యాచ్ ల్లో డి కాక్ 12వేల 160 పరుగులు సాధించగలిగాడు.

బంగ్లా బౌలర్లలో హసన్ 2 వికెట్లు, మిరాజ్, షకీబుల్, షరీఫుల్ తలో వికెట్ పడగొట్టారు.

మహ్మదుల్లా ఫైటింగ్ సెంచరీ..

మ్యాచ్ నెగ్గాలంటే 384 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ టాపార్డర్ పేకమేడల కూలింది. మిడిలార్డర్ ఆటగాడు మహ్మదుల్లా 111 బంతుల్లో 111 పరుగులతో పోరాడి ఆడి శతకం బాదినా ప్రయోజనం లేకపోయింది. బంగ్లాజట్టు 46.4 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలి 149 పరుగుల ఓటమితో నాకౌట్ రేస్ కు మరింత దూరమయ్యింది.

సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోట్జే 3, లిజాడ్ విలియమ్స్, మార్కె జెన్సన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 5 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి భారత్ 10 పాయింట్లతో టాపర్ గా నిలువగా..దక్షిణాఫ్రికా రెండు, న్యూజిలాండ్ మూడుస్థానాలలో నిలిచాయి.


Tags:    
Advertisement

Similar News