ఇటు సౌరవ్..అటు శ్రీనివాసన్..భారత ప్రతినిధి ఎవరో?

అంతర్జాతీయ క్రికెట్ మండలిలో భారత ప్రతినిధి ఎవరో తేల్చుకోడానికి కురువృద్ధుడు ఎన్ శ్రీనివాసన్, సౌరవ్ గంగూలీ ఢీ అంటే ఢీ అంటున్నారు. త్వరలో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధిని ఓటింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు.

Advertisement
Update:2022-09-23 12:24 IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ ) చైర్మన్ పదవికి భారత్ గురిపెట్టింది. ఐసీసీలో భారత ప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తికే చైర్మన్ పదవి దక్కనుంది. భారత ప్రతినిధిని ఎంపిక చేయటానికి బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని అక్టోబర్ 18న ముంబైలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రేస్‌లో ఆ ఇద్దరు...

ఐసీసీలో భారత ప్రతినిధిగా వ్యవహరించడానికి బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ పోటీపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని తమ ప్రతినిధిగా త్వరలో జరిగే స్వర్వసభ్య సమావేశంలో ఎంపిక చేయనున్నారు. 70 సంవత్సరాలు పైబడిన వారు సైతం బీసీసీఐ కార్యవర్గంలో సభ్యుడిగా పని చేయవచ్చునంటూ ఇటీవలే సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ తీర్పునివ్వడంతో 77 సంవత్సరాల శ్రీనివాసన్‌కు మార్గం సుగమమైంది. క్రికెట్ వ్యవహారాలలో అపార అనుభవం ఉన్న శ్రీనివాసన్ ఐసీసీలో భారత ప్రతినిధిగా వ్యవహరించడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే ఐసీసీ చైర్మన్ కానున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఐసీసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న గ్రెగ్ బార్క్ లే పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుంది. ఆ స్థానాన్ని భారత ప్రతినిధితో భర్తీ చేయనున్నారు.

సాధారణ మెజారిటీతోనే ఎంపిక..

ఐసీసీ చైర్మన్ ఎంపిక కోసం నిర్వహించే ఓటింగ్ విధానాన్ని మరింత సరళం చేశారు. గతంలో మూడింట రెండు వంతుల ఓట్లు పొందినవారినే ఐసీసీ చైర్మన్‌గా ఎంపిక చేసే విధానం ఉండేది. అయితే తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం 51 శాతం ఓట్లు తెచ్చుకొంటే చాలు. ఐసీసీలోని మొత్తం 16 మంది సభ్యుల్లో 9 ఓట్లు పొందినవారే చైర్మన్‌గా ఎంపిక కానున్నారు.

నా చేతుల్లో లేదు - సౌరవ్

ఐసీసీ చైర్మన్‌గా ఎంపికకావడం తన చేతుల్లో లేదని, ఆ అంశాన్ని నిర్ణయించాల్సింది ముందుగా బీసీసీఐ సభ్యులు, ఆ తర్వాత ఐసీసీ సభ్యులు మాత్రమే నంటూ సౌరవ్ బదులిచ్చారు. వచ్చేనెలలో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గానికి ఎన్నిక నిర్వహించడంతో పాటు..మహిళా ఐపీఎల్ నిర్వహణతో పాటు మరో 27 అంశాలను ఎజెండాలో పొందుపరిచారు. భారత క్రికెటర్ల సంఘం నుంచి ఇద్దరు (పురుష, మహిళ ) ప్రతినిధులతో పాటు, ఐపీఎల్ బోర్డుకు సైతం మరో ఇద్దరు ప్రతినిధులను ఎంపిక చేసే అంశాన్ని సైతం ఎజెండాలో చేర్చారు. క్రికెట్ అంపైర్ల కమిటీ, స్టాండింగ్ కమిటీలతో పాటు ఆంబుడ్స్ మన్, ఎథిక్స్ అధికారులను సైతం బీసీసీఐ సర్వసభ్యసమావేశంలో నియమించనున్నారు.

Tags:    
Advertisement

Similar News