మహిళాటెస్టు లో భారత ఓపెనర్ ప్రపంచ రికార్డు!

మహిళా టెస్టు క్రికెట్లో భారత ఓపెనర్ షెఫాలీవర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం 194 బంతుల్లోనే 205 పరుగులతో డబుల్ సెంచరీ సాధించింది..

Advertisement
Update: 2024-06-29 02:45 GMT

మహిళా టెస్టు క్రికెట్లో భారత ఓపెనర్ షెఫాలీవర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం 194 బంతుల్లోనే 205 పరుగులతో డబుల్ సెంచరీ సాధించింది.

మహిళాటెస్టుల్లో మెరుపు డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా భారత డాషింగ్ ఓపెనర్, 20 ఏళ్ల షెఫాలీవర్మ నిలిచింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన ఏకైక టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటలోనే ఈ ఘనత సంపాదించింది.

ఒక్కరోజు ఆటలో 525 పరుగుల రికార్డు...

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ నాలుగురోజుల టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికే భారత్ 4 వికెట్లకు 525 పరుగుల స్కోరు సాధించడం ద్వారా మరో ప్రపంచ రికార్డు సాధించింది. సింగిల్ డేలో ఇంత భారీస్కోరు సాధించిన తొలిజట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

యువఓపెనర్ షెఫాలీ వర్మ ( 205 )- స్మృతి మంధన ( 149 ) 292 పరుగుల భారీభాగస్వామ్యం నమోదు చేయగలగడంతో ఈ రికార్డుస్కోరు సాధ్యపడింది.

ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా బ్యాటర్ అన్నాబెల్ సూదర్ లాండ్ పేరుతో ఉన్న 248 బంతుల్లో డబుల్ సెంచరీ రికార్డును షెఫాలీ కేవలం 194 బంతుల్లోనే సాధించడం ద్వారా తెరమరుగు చేయగలిగింది.

భారత రెండో మహిళ షెఫాలీ..

మహిళాటెస్టు చరిత్రలో ద్విశతకం బాదిన భారత రెండో మహిళగా షెఫాలీవర్మ నిలిచింది. 2002 ఆగస్టులో టాంటన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టుమ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ మిథాలీరాజ్ 407 బంతుల్లో 214 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన భారత తొలిమహిళగా మిథాలీ రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత 22 సంవత్సరాల విరామం తరువాత షెఫాలీ మెరుపు ద్విశతం సాధించడం ద్వారా మిథాలీ రికార్డును అధిగమించగలిగింది. టెస్టు క్రికెట్లో ద్విశతకం సాధించిన భారత రెండో క్రికెటర్ గా, తొలి ఓపెనర్ గా రికార్డుల్లో చేరింది.

తన కెరియర్ లో 5వ టెస్టుమ్యాచ్ ఆడుతున్న షెఫాలీ ద్విశతకంలో 23 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ షెఫాలీ అత్యుత్తమ టెస్టు స్కోరు 96 పరుగులుగా మాత్రమే ఉంది.

89 ఏళ్ల రికార్డును తిరగరాసిన భారత్..

మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలో 89 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును భారత్ సవరించడంతో పాటు సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయగలిగింది.

టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ సాధించిన 2 వికెట్లకు 431 పరుగుల ప్రపంచ రికార్డును భారత్ 4 వికెట్లకు 525 పరుగుల స్కోరుతో తెరమరుగు చేసింది.

Tags:    
Advertisement

Similar News